దుమ్ముగూడెం, ఆగస్టు 01 (వై 7 న్యూస్);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, గోదావరి వరద ప్రభావంతో దుమ్ముగూడెం మండలంలోని నడిగూడి రేగులబండి పైకి వరద నీరు చేరింది. దీంతో ఆ మార్గంలో వాహనాలు, ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ప్రవాహం పెరగడంతో పరిసర ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నడిగూడి రేగులబండి పైకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రతా దృష్ట్యా అధికారులు ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు.
ప్రస్తుతం పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వరద నీటిలో ప్రయాణాలు చేయవద్దని, సాహస యాత్రలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని సూచించారు.
అలాగే ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. వరద పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి, ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు కనిపించినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.









