E-PAPER

మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు – క్షేత్రస్థాయిలో పరిస్థితుల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్

భద్రాచలం వద్ద ఉద్ధృతంగా గోదావరి

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 1 (Y7 న్యూస్):
భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. శనివారం ఉదయం 10 గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 56 అడుగులకు చేరుకోగా, సుమారు 15,90,778 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

వరద పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అంకిత్ భద్రాచలం గోదావరి స్నాన ఘాట్లు, కరకట్ట ప్రాంతం, భద్రాచలం–కూనవరం ప్రధాన రహదారి వెంట వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం, ప్రభావిత గ్రామాల పరిస్థితి, సహాయక చర్యల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నందున జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను టామ్‌టామ్, మైకింగ్ ద్వారా నిరంతరం అప్రమత్తం చేయాలని, వరద ముప్పు ఉన్న గ్రామాల ప్రజలను ఆలస్యం చేయకుండా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పునరావాస కేంద్రాల్లో తాగునీరు, నాణ్యమైన భోజనం, పారిశుద్ధ్య వసతులు, విద్యుత్, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

అలాగే భద్రాచలం–కూనవరం రహదారిపై వరద నీరు చేరిన ప్రాంతాల్లో వెంటనే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు బ్యారికేడ్లను దాటి వెళ్లకుండా పోలీసు శాఖ నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

గోదావరి నదిలో స్నానాలు చేయడం, ఈత కొట్టడం, వరద నీటిలోకి వెళ్లడం, ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం, చేపలు పట్టడం వంటి చర్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు.

ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, అత్యవసర పరిస్థితుల్లో జిల్లా ఫ్లడ్ కంట్రోల్ రూమ్ 08744-241950 లేదా వాట్సాప్ నంబర్ 9392919743 ను సంప్రదించాలని సూచించారు.

ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను విస్తృత స్థాయిలో కొనసాగిస్తున్నామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!