పలాస, జూలై 30 (వై7 న్యూస్): పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు తిలక్ నగర్, 18వ వార్డుల్లో గురువారం నిర్వహించిన “ఇంటింటికి కూటమి ప్రభుత్వం” కార్యక్రమంలో పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ప్రజల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పిస్తూ, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తోందన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అనంతరం 17వ వార్డులో అర్హులైన వికలాంగ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను స్వయంగా అందజేసి, వారి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల సమస్యలను విని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని, ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








