
పలాస, జూలై 30 (వై7 న్యూస్): చేనేత రంగ పరిరక్షణ, చేనేత కార్మికుల సంక్షేమం మరియు ఆత్మగౌరవ పరిరక్షణ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించనున్న “చేనేత సమ్మేళనం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు పిలుపునిచ్చారు.
గురువారం శ్రీకాకుళం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు లక్కోజు ధర్మారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మోర్చా నాయకులతో కలిసి సిరిపురం తేజేశ్వరరావు చేనేత సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 5వ తేదీ ఉదయం 9.30 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేనేత సమ్మేళనం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి భారీ శోభాయాత్ర ప్రారంభమై తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకుంటుందని చెప్పారు.
చేనేత రంగ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణ, సంప్రదాయ చేనేత కళల పరిరక్షణతో పాటు కొత్త మార్కెట్ అవకాశాలపై ఈ సమ్మేళనంలో విస్తృతంగా చర్చలు జరగనున్నాయని వివరించారు. చేనేత కార్మికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








