చండ్రుగొండ మండలంలో రూ.1.25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
చండ్రుగొండ, జూలై 30 (Y7 News): ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో పర్యటించిన మంత్రి రూ.1.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
మంత్రి ముందుగా మంగయ్య బంజార గ్రామంలో రూ.45 లక్షల వ్యయంతో మంగయ్య బంజారు–గానుగపాడు రహదారిపై గ్రావెల్ రోడ్డు, కల్వర్టు నిర్మాణం, సీసీ రోడ్డు, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి 24 ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసినట్లు ప్రకటించారు.
అనంతరం పొకలగూడెం గ్రామంలో రూ.60 లక్షలతో నాలుగు సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామానికి ఇప్పటికే 77 ఇందిరమ్మ గృహాలు మంజూరయ్యాయని, మిగిలిన అంతర్గత రహదారుల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
తదుపరి రావికంపాడు గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో రెండు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.8.21 లక్షల కోట్ల అప్పులతో వదిలివెళ్లినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. రెండేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయగా, మరో 16 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు.
మహిళల ఆర్థిక సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలకు రూ.70 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించామని, అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు, నాణ్యమైన సన్నబియ్యం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
ఇందిరమ్మ గృహాల పథకం కింద తొలి విడతలో 4.50 లక్షల గృహాలు, రెండో విడతలో 2.50 లక్షల గృహాలు మంజూరు చేసి మొత్తం 7 లక్షల గృహాల నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క పేద కుటుంబం కూడా పూరి గుడిసెలో నివసించకుండా ప్రతి అర్హ కుటుంబానికి శాశ్వత గృహాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, తాగునీటి సదుపాయాలు, కల్వర్టులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. చండ్రుగొండ మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు.
అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతో చండ్రుగొండ మండలానికి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మంజూరవుతున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని పనులు చేపడతామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, మండలంలో ఇందిరమ్మ గృహాల కోసం పూరి గుడిసెల సర్వే పూర్తయిందని, అర్హుల గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి శుక్రవారం “ఫ్రైడే–డ్రై డే” కార్యక్రమం నిర్వహిస్తూ సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో మధు, తహసీల్దార్ జగదీశ్వర ప్రసాద్, పంచాయతీ అధికారి అనూష, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.








