అభిజీత్ దేప్కే ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తర్వాత అంశాల ఆధారిత డిజిటల్ ఉద్యమాలు సోషల్ మీడియాలో వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. సరదా ప్రచారాల నుంచి ప్రజా సమస్యల వరకు విభిన్న అంశాలపై కొత్త గ్రూపులు వెలుగులోకి వస్తుండగా, ప్రస్తుతం ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’ (RHA) అనే డిజిటల్ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఈ ఉద్యమానికి సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ ఉద్యమం ప్రధానంగా కుల ఆధారిత రిజర్వేషన్లు, కుల గణనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ప్రతిభ ఆధారంగా అవకాశాలు కల్పించాలని, కులాతీత సమాజం ఏర్పడాలని తమ లక్ష్యంగా పేర్కొంటోంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఖాతాకు 5.8 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం. అనేక ప్రధాన రాజకీయ పార్టీల అధికారిక ఖాతాల కంటే దీనికి ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
దాదాపు 120కి పైగా పోస్టులతో ఈ పేజీ వేగంగా ప్రజాదరణ పొందుతోంది. ఆసక్తికరంగా, ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కేవలం భారత సైన్యం అధికారిక ఖాతాను మాత్రమే ఫాలో అవుతుండటం కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ ఉద్యమం అభిప్రాయాలు, డిమాండ్లు నిర్వాహకులవేనని, అవి అధికారిక ప్రభుత్వ విధానాలను సూచించవని గుర్తుంచుకోవాలి.








