చైనాలో మరోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. 2026లో తొలిసారిగా కరోనా వైరస్ వ్యాప్తి ఇన్‌ఫ్లుయెంజాను దాటి అత్యంత వేగంగా వ్యాపిస్తున్న శ్వాసకోశ వ్యాధిగా నమోదైంది. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది బాధితులకు స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని, గత ఏడాదితో పోలిస్తే వైరస్ ప్రభావం తక్కువగా ఉందని చైనా ఆరోగ్య అధికారులు తెలిపారు.
చైనా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (CDC) వివరాల ప్రకారం, జూలై 13 నుంచి 19 వరకు నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్-19 పాజిటివిటీ రేటు 16.3 శాతానికి చేరుకోగా, ఫ్లూ పాజిటివిటీ రేటు 12.6 శాతంగా నమోదైంది. జూన్ 2026లో దేశవ్యాప్తంగా సుమారు 79 వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 130 మంది పరిస్థితి విషమించగా, ఒక మరణం మాత్రమే నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం చైనాలో ఒమిక్రాన్‌కు చెందిన NB.1.8.1 వేరియంట్ ప్రధానంగా వ్యాపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వేరియంట్ వ్యాప్తి సామర్థ్యం మధ్యస్థంగా ఉందని, ప్రస్తుతం ప్రజారోగ్యానికి అధిక ప్రమాదం కలిగించే కొత్త వేరియంట్లు ఏవీ గుర్తించలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.








