‘‘ఉద్యమం ముగిసింది.. కానీ పోరాటం కాదు’’ అంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. విద్యా సంస్కరణలు, యువత సమస్యల పరిష్కారం, ఉద్యమాన్ని గ్రామస్థాయికి విస్తరించడంపై తమ దృష్టి కొనసాగుతుందని తెలిపారు. తదుపరి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
పంజాబ్ పేపర్ లీక్ వ్యవహారంపై కూడా త్వరలో స్పందిస్తామని, దీనికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అభిజిత్ దీప్కే చెప్పారు. విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని, ఏ విద్యార్థిపైనా కేసులు నమోదు చేయకూడదనేదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ ఉద్యమం ముగిసిపోలేదని, అది మరింత పెద్ద పోరాటానికి ఆరంభమని సీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది. యువత సమస్యలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పరిపాలనలో మార్పుల కోసం తమ ప్రచారం కొనసాగుతుందని పార్టీ ప్రతినిధులు తెలిపారు. అలాగే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేమని సీజేపీ నేత అశుతోష్ రాంకా వ్యాఖ్యానించారు.








