ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో భారీ భద్రతా ఆపరేషన్ చేపట్టనున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. గ్రామాల్లో విస్తృత సోదాలు నిర్వహించడం, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం, అనుమానితులను అరెస్ట్ చేయాలని భద్రతా బలగాలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాద స్థావరాలపై సమగ్ర చర్యలు తీసుకునేందుకు ఇజ్రాయిల్ పూర్తిగా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
ఇప్పటికే వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయిల్ సైనిక చర్యలు కొనసాగుతుండగా, నెతన్యాహూ తాజా ప్రకటనతో రాబోయే రోజుల్లో ఆపరేషన్లు మరింత తీవ్రం కానున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై అంతర్జాతీయంగా కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు, ‘యూత్ అగైనెస్ట్ సెటిల్మెంట్స్’ వ్యవస్థాపకుడు ఇస్సా అమ్రో ఆక్రమిత ప్రాంతాల్లో నివసిస్తున్న పాలస్తీనీయులు ప్రతిరోజూ హింస, నిర్బంధాలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఇటీవల సంవత్సరాల్లో 20కి పైగా పాలస్తీనా గ్రామాలు ఖాళీ అయ్యాయని, వందలాది కుటుంబాలు తమ నివాసాలను విడిచిపెట్టాల్సి వచ్చిందని పేర్కొంటూ, ఈ పరిస్థితిని ఆయన ‘‘జాతి ప్రక్షాళన’’గా అభివర్ణించారు.








