పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మార్చే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే పరీక్షల్లో సంస్కరణల కోసం హైపవర్ టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ టెక్నాలజీ వినియోగం, పరీక్షల భద్రత, నిర్మాణాత్మక మార్పులు, పారదర్శకత వంటి అంశాలపై సిఫారసులు చేయనుంది.
ఈ కమిటీకి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చైర్మన్గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మాజీ ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్, మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనా వంటి ప్రముఖులు చోటు దక్కించుకున్నారు.
ఎన్టీఏ పరీక్షల విశ్వసనీయతను మరింత బలోపేతం చేయడం, భవిష్యత్తులో పరీక్షల నిర్వహణను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా ఉండనుంది. కమిటీ ఇచ్చే సిఫారసుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలను అమలు చేసే అవకాశం ఉంది.








