E-PAPER

షెడ్యూల్డ్ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఆదివాసీలకే దక్కాలి:జీవో 3 స్థానంలో ప్రత్యేక చట్టం తేవాలి: కుంజ శ్రీను”ASP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

విజయవాడ, జూలై 22 (వై7 న్యూస్):
విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ASP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను పాల్గొని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల విద్య, ఉద్యోగాలు, భూరక్షణకు సంబంధించి పలు కీలక అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

సమావేశంలో కుంజ శ్రీను మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైశాల్యంలో ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతం కేవలం 4.6 శాతం మాత్రమేనని, ఈ ప్రాంతంలోని ఉద్యోగాలను 100 శాతం స్థానిక ఆదివాసీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో అమలులో ఉన్న జీవో నెంబర్–3ను చట్టరూపంలో కాకుండా పరిపాలనా ఉత్తర్వుగా జారీ చేయడం వల్లే అది న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొన్నదని పేర్కొన్నారు.

జీవో నెంబర్–3 స్థానంలో రాజ్యాంగబద్ధమైన ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ, గిరిజన సలహా మండలి (TAC) తీర్మానం, గవర్నర్ ఆమోదం, రాష్ట్ర శాసనసభ చట్టం, పార్లమెంట్ ఆమోదం మరియు రాష్ట్రపతి అంగీకారంతో “ఏజెన్సీ ఉద్యోగ నియామక చట్టం” రూపొందించాలని సూచించారు. అలాంటి చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కూడా డిమాండ్ చేశారు.

ఫిఫ్త్ షెడ్యూల్, ఐటిడిఏల స్థాపన లక్ష్యం, 1/70 భూరక్షణ చట్టం ఉద్దేశం ఆదివాసీల హక్కులు, భూములు, వనరులను రక్షించడమేనని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నాన్-ట్రైబల్స్ స్థిరాస్తులు కలిగి ఉండటమే కాకుండా, ఉద్యోగాల్లోనూ వాటా కోరడం ఫిఫ్త్ షెడ్యూల్ ఆశయాలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు.

అలాగే 1/70 చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన 508 మంది నాన్-ట్రైబల్స్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత భూములపై సుమోటో కేసులు నమోదు చేసి, చట్టవిరుద్ధ ఆక్రమణలను గుర్తించి, నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్రమ మైనింగ్, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రిసార్టులు, చింతూరు మండలంలోని RoFR పొడు పట్టాల పంపిణీ, సరివెల–పేగ రోడ్డు నిర్మాణం, ఆశ్రమ పాఠశాలల్లో సిబ్బంది నియామకాలు, పాఠశాలల విలీన ప్రక్రియ రద్దు వంటి అంశాలను వినతిపత్రం ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఈ అంశాలపై అధికారులు సానుకూలంగా స్పందించి, ఆదివాసీల హక్కుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కుంజ శ్రీను వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సంక్షేమ పరిషత్ నాయకులు కోటం రాజన్న దొర, పీఠా ప్రసాద్, తెల్లం లక్ష్మణరావు, ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు, సరియం నాగేశ్వరావు, సోదం రాజులు, సిరి దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News