అశ్వాపురం, జూన్ 29 (వై7 న్యూస్): పేదల సొంతింటి కలను సాకారం చేయడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి నాణ్యమైన గృహాలను అందిస్తున్నామని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.
సోమవారం అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని బడుగు బజార్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులు గాదె మాధవి, సిలివేరు అనసూర్య కుటుంబ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సొంత ఇల్లు ప్రతి కుటుంబానికి భద్రత, గౌరవం, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. కొత్త ఇంటిలో అడుగుపెట్టిన కుటుంబాలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్వో సూర్యప్రకాష్, ఎంపీడీవో ముత్యాలరావు, హౌసింగ్ ఏఈలు ఉదయ్ కుమార్, భరత్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి యాకుబ్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.








