E-PAPER

ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరు పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం;

జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచేందుకు బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. డిసెంబర్–2025 త్రైమాసికానికి సంబంధించిన జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) సమావేశం బుధవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించబడింది.
ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షత వహించగా, లీడ్ బ్యాంక్ మేనేజర్, నాబార్డ్ ప్రతినిధులు, వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రాధాన్యతా రంగ రుణాల లక్ష్యాలు మరియు సాధనపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో ప్రాధాన్యతా రంగంలో ₹4945.28 కోట్ల లక్ష్యానికి గాను ₹4010.50 కోట్లు మంజూరు చేయబడగా, 81.10 శాతం సాధన నమోదైనట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో ₹3899.28 కోట్ల లక్ష్యానికి గాను ₹3339.70 కోట్లు మంజూరు చేసి 85.65 శాతం సాధన నమోదైంది. ఇందులో పంట రుణాలు ₹2291.82 కోట్ల లక్ష్యానికి గాను ₹1415.69 కోట్లు (61.77%), అగ్రి టర్మ్ లోన్స్ ₹1416.09 కోట్ల లక్ష్యానికి గాను ₹1280.21 కోట్లు (90.40%), అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ₹31.41 కోట్ల లక్ష్యానికి గాను ₹18.44 కోట్లు (58.71%), అనుబంధ కార్యకలాపాలు ₹159.97 కోట్ల లక్ష్యానికి గాను ₹625.35 కోట్లు (390.92%) మంజూరు చేయబడినట్లు వివరించారు.
ఎంఎస్‌ఎంఈ రంగంలో ₹847.80 కోట్ల లక్ష్యానికి గాను ₹563.90 కోట్లు మంజూరు చేసి 66.51 శాతం సాధన నమోదైంది. విద్యా రుణాల్లో ₹13 కోట్ల లక్ష్యానికి గాను ₹9.70 కోట్లు (74.62%), గృహ రుణాల్లో ₹26.30 కోట్ల లక్ష్యానికి గాను ₹21.68 కోట్లు (82.43%) మంజూరు చేశారు. సామాజిక మౌలిక వసతుల రంగంలో ₹3.30 కోట్ల లక్ష్యానికి గాను ₹0.33 కోట్లు మాత్రమే మంజూరు కావడంతో 10 శాతం సాధన నమోదైంది.
ఈ సందర్భంగా రైతు రుణాల పంపిణీపై బ్యాంకుల వారీగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంట రుణాల పంపిణీ తక్కువగా ఉన్న బ్యాంకులపై ఆరా తీశారు. రైతులు తమ రుణాలను సకాలంలో రీన్యువల్ చేసుకునే అంశంపై అవగాహన కల్పించాలని, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు.
పునరుత్పాదక ఇంధన రంగంలో ₹3.24 కోట్ల లక్ష్యానికి గాను ₹12.37 కోట్లు మంజూరు చేసి 381.79 శాతం సాధన నమోదైనట్లు తెలిపారు. ఇతర విభాగాల్లో ₹152.35 కోట్ల లక్ష్యానికి గాను ₹62.82 కోట్లు (41.23%) మంజూరు చేయబడినట్లు వివరించారు.
స్వయం సహాయక సంఘాలు–బ్యాంక్ లింకేజీ, ఎన్పీఏల తగ్గింపు, ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు (పీఎం స్వనిధి, పీఎంఈజీపీ, పీఎం ముద్ర, పీఎం విశ్వకర్మ, పీఎంఎఫ్‌ఎంఈ, ఏఐఎఫ్)పై సమీక్ష నిర్వహించి, అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ప్రతి గ్రామానికి బ్యాంకింగ్ సేవలు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి లక్ష్య సాధనలో ముందుండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, సిపిఓ సంజీవరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, పశుసంవర్ధక, మత్స్య శాఖ అధికారులు, నాబార్డ్, రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధులు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News