వై7 న్యూస్ | పలాస (సోంపేట)
30 తులాల బంగారం, రూ.లక్ష నగదు మాయం
సోంపేట పట్టణంలోని కోర్టుపేట వీధిలో జరిగిన భారీ చోరీ సంచలనం సృష్టించింది. స్థానికంగా నివాసం ఉంటున్న తాగుడు మనోజ్ ఇంట్లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చొరబడి 30 తులాల బంగారం, రూ.1 లక్ష నగదు చోరీ చేసినట్లు సమాచారం.
ఆదివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఫంక్షన్‌కి వెళ్లిన మనోజ్, అనంతరం భార్యతో కలిసి బరంపురంలోని మరో ఫంక్షన్‌కు వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి తిరిగి వస్తుండగా ఇచ్చాపురం సమీపంలో ఓ ద్విచక్ర వాహనం అతి వేగంగా వచ్చి మనోజ్‌ను ఢీకొనడంతో స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఇంటికి చేరుకున్నారు.
తదుపరి రోజు తెల్లవారుజామున ఇంటిని పరిశీలించగా, తాళం పగలగొట్టి మళ్లీ తాళం వేసినట్లు గుర్తించారు. లోపలికి వెళ్లి చూసేసరికి బీరువా తెరిచి ఉండగా, అందులో దాచిన బంగారం, నగదు కనిపించకుండా పోయాయి.
ఈ ఘటనపై సమాచారమందుకున్న సోంపేట సీఐ మంగరాజు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పట్టణ కేంద్రంలో, కోర్టు సమీపంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.









