E-PAPER

ప్రతిఘటన తొలి అమరులకు అశ్వాపురంలో నివాళి

సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ పిలుపు మేరకు సంస్మరణ సభ

అశ్వాపురం:సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు అశ్వాపురం మండల కేంద్రంలో అమరవీరుల సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కామ్రేడ్ పెదగొని ఆదిలక్ష్మి అధ్యక్షత వహించగా, డివిజన్ నాయకులు పావురాల లాలయ్య పార్టీ జెండాను ఎగురవేశారు.

ప్రతిఘటన పోరాట తొలి అమరులు బత్తుల వెంకటేశ్వరరావు, సూర్యనారాయణ, బిజ్జా వెంకన్న (గొందిగూడెం అమరవీరులు) స్మారక స్తూపం వద్ద సభ నిర్వహించబడింది.

ఆ రోజుల్లో చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో ఏర్పడిన తొలి దళంపై పోలీసులు తప్పుడు సమాచారంతో ప్రజలను ఉసిగొలిపి దాడి చేయించి, తర్వాత ఆ కామ్రేడ్స్‌ను అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసి బూటకపు ఎన్‌కౌంటర్‌లో హతమార్చినట్లు సభలో గుర్తుచేశారు.

సీనియర్ నాయకుడు కామ్రేడ్ జగ్గన్న మాట్లాడుతూ, తాను కూడా దళంలో నాయకుడిగా పనిచేసిన కాలం గురించి, ఆ కాలంలోని పోరాటాలు, త్యాగాల గురించి వివరించారు. ఆయనతో పాటు పోరాడిన కామ్రేడ్ లక్ష్మక్క, ఇస్తారి, మొండికుంట జాన్ రెడ్డి, రంగవల్లి వంటి నేతలు కూడా ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు అర్పించినట్లు తెలిపారు.

అమరవీరుల త్యాగాలు నేటి తరం తెలుసుకోవాలని, వారు పోరాడిన లక్ష్యాలు ఇంకా సాధ్యం కాలేదని, రైతాంగ సమస్యలు తీవ్రమవుతున్న వేళ ప్రజా ఉద్యమాలు బలపడాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.కార్పొరేట్లకు వ్యతిరేకంగా బలమైన ప్రజా పోరాటాలు జరగాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు మెస్ గోపాల్, బత్తిని సత్యం, పిఓడబ్ల్యూ డివిజన్ అధ్యక్షురాలు కొడిమ రాధ, పి.వై.ఎల్ నాయకులు మొసలి సతీష్, అలాగే న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు Y.S. రెడ్డి, తెల్ల వెంకటమ్మ, కనతాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News