అప్పుడే నేటి బాలలు.. రేపటి శాస్త్రవేత్తలవుతారు
పిలుపునిచ్చిన ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి
అన్నపురెడ్డిపల్లి లో 52వ జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనను ప్రారంభించిన పార్లమెంట్ సభ్యులు
748 ఎగ్జిబిట్ల ఏర్పాటు పట్ల హర్షం
అన్నపురెడ్డిపల్లి,నవంబర్ 18 వై 7 న్యూస్ తెలుగు;
మారుతున్న కాలానికి అనుగుణంగా మూఢనమ్మకాలు వీడి.. శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. సోమవారం అన్నపురెడ్డిపల్లి లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేసిన 52వ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి.. పలువురు అధికారులతో కలిసి విద్యార్థులు ఏర్పాటుచేసిన ప్రయోగాలతో కూడిన స్టాళ్లను పరిశీలించారు. సేంద్రీయ సాగు, కోళ్ల పెంపకం, ఇంధన, విద్యుత్ పొదుపు.. సాగునీటి వనరుల వినియోగం.. తదితర అంశాలపై విద్యార్థులు వివరిస్తుండగా.. ఎంపీ ఆసక్తిగా విని వారిని అభినందించారు. అనంతరం విక్రమ్ సారాభాయ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఎంపీ రఘురాంరెడ్డి ప్రసంగించారు. సైన్స్ ప్రాధాన్యం మరింతగా పెరిగిందని.. అందరూ శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. వ్యవసాయంలో డ్రోన్లను వినియోగిస్తున్నారని, రోబోటిక్ సర్జరీలు చేసే స్థాయికి ఎదిగామని తెలిపారు. సైన్స్ పై మక్కువ పెంచుకునేలా.. పిల్లల మనసులో ఇప్పటినుంచే బీజం వేయాలని.. భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా మార్చేలా తీర్చిదిద్దుతామని పిలుపునిచ్చారు. విద్యార్థుల ఆసక్తి, ఉపాధ్యాయుల కృషితో 748 ఎగ్జిబిట్లు రావడం హర్షనీయమని అన్నారు.
*ఎమ్మెల్యే కృషి అభినందనీయం..*
స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేక శ్రద్ధతో.. అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారని ఎంపీ రఘురాంరెడ్డి అన్నారు. సందర్భంగా ఎమ్మెల్యేను ప్రత్యేకంగా అభినందించారు.
*ఈ కార్యక్రమంలో..* సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ స్వరూపారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటాచారి, జిల్లా సైన్స్ అధికారి ఎస్.చలపతిరావు, కాంగ్రెస్ జిల్లా నాయకులు నాగ సీతారాములు, ఆళ్ల మురళి, కొప్పుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.









