E-PAPER

వడోదర ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌పై దాడికి స్కెచ్.. ఏకే-47తో దొరికిపోయిన జైషే ఉగ్రవాది..

గుజరాత్‌లో భారీ ఉగ్రవాద దాడికి పన్నిన కుట్రను భద్రతా బలగాలు విజయవంతంగా భగ్నం చేశాయి. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం)కు చెందిన 22 ఏళ్ల అనుమానిత ఉగ్రవాదిని గుజరాత్ ఉగ్రవాద నిరోధక విభాగం (ఏటీఎస్) వడోదరలో అరెస్ట్ చేసింది. పట్టుబడిన నిందితుడిని అసోంలోని కరీంగంజ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సహారుల్ ఇస్లాం కబీరుద్దీన్‌గా అధికారులు గుర్తించారు.

వడోదరలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌పై ‘లోన్ ఉల్ఫ్’ తరహా దాడి చేసేందుకు నిందితుడు పథకం రచించాడని ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి మీడియాకు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఒక ఏకే-47 అసాల్ట్ రైఫిల్, 23 లైవ్ కార్ట్రిడ్జ్‌లు, రెండు ఖాళీ మ్యాగజైన్లు, జైషే మహ్మద్ జెండా, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌పై దాడికి పాల్పడిన అనంతరం అతడు పాకిస్థాన్‌కు పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

గత ఏడాది కాలంగా నిందితుడు పాకిస్థాన్‌కు చెందిన జైషే హ్యాండ్లర్ ముఫ్తీ రఫీక్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడు. కేంద్ర నిఘా వర్గాలు, గుజరాత్ ఏటీఎస్ గత 6 నెలలుగా అతడిపై సాంకేతిక, భౌతిక నిఘా ఉంచాయి. నవంబర్ 23న అతడు కుట్రను అమలు చేసేందుకు గుజరాత్‌కు బయలుదేరాడన్న సమాచారంతో అధికారులు ఆపరేషన్ ముమ్మరం చేశారు. నిఘా వర్గాలకు చిక్కకుండా ఉండేందుకు అతడు అసోం నుంచి పలు రైళ్లు, బస్సులు మారుతూ వడోదర చేరుకున్నాడు. గతంలోనే ఇక్కడికి వచ్చి ఎయిర్ ఫోర్స్ స్టేషన్, విమానాశ్రయం పరిసరాల్లో రెక్కీ నిర్వహించి ఫోన్‌లో ఫొటోలు తీసినట్లు తేలింది.

నిందితుడిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA), భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసులు నమోదు చేశారు. పాకిస్థాన్ నుంచి అక్రమంగా వచ్చినట్లు భావిస్తున్న ఆయుధ సరఫరా నెట్‌వర్క్, స్థానికంగా ఎవరైనా సహకరించారా? అనే కోణంలో భద్రతా సంస్థలు విచారణ కొనసాగిస్తున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!