E-PAPER

అమెరికాను ముంచెత్తిన వరదలు, మంచు తుపాను..!

అమెరికాలో అత్యంత ఘనంగా జరుపుకునే ‘థాంక్స్ గివింగ్’ పండుగ వేళ ప్రకృతి తీవ్ర ప్రకోపం చూపించింది. భారీ వర్షాలు, పెనుగాలులు, ఆకస్మిక వరదలు, దట్టమైన మంచు తుపానులతో దేశంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా అమెరికా తూర్పు తీర రాష్ట్రాలపై తుపాను ప్రభావం తీవ్రంగా పడింది. ఈ విపత్తు కారణంగా దాదాపు 10 లక్షల ఇళ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అమెరికావ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. 2,200 కంటే ఎక్కువ విమాన సర్వీసులు ఆలస్యంగా నడవగా, 400కి పైగా విమానాలు పూర్తిగా రద్దయ్యాయి. రోడ్లు, రైలు మార్గాలు సైతం వరద నీటిలో మునిగిపోయాయి.

న్యూయార్క్ నగరంలో ఏటా అట్టహాసంగా నిర్వహించే ప్రపంచ ప్రఖ్యాత ‘మేసీస్ థాంక్స్ గివింగ్ డే పరేడ్’ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాయిదా పడింది. వీధుల్లో తిరిగే భారీ బెలూన్లకు బలమైన గాలుల వల్ల ప్రమాదం పొంచి ఉండటంతో అధికారులు ఈ పరేడ్‌ను శనివారానికి వాయిదా వేశారు. ఈ వార్షిక వేడుక ఇలా వాయిదా పడటం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

మరోవైపు వరదల తీవ్రత దృష్ట్యా న్యూజెర్సీ, న్యూయార్క్‌లలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. న్యూజెర్సీలోని అవలోన్, ఓషన్ సిటీలలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. రోడ్లు జలమయం కావడంతో కార్లలో చిక్కుకుపోయిన అనేకమందిని సహాయక బృందాలు రక్షించాయి. నార్త్ కరోలినా నుంచి దక్షిణ న్యూ ఇంగ్లాండ్ వరకు తీవ్ర ప్రభావం పడగా, చెసాపీక్ బే బ్రిడ్జ్-టన్నెల్, ఎన్‌సీ 12 ప్రధాన రహదారులను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. మేరీల్యాండ్‌లో విద్యుత్ సమస్యల కారణంగా దాదాపు 20 లక్షల మందికి నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

మిడ్‌వెస్ట్ రాష్ట్రాలైన ఇల్లినాయిస్, మిస్సోరీలలో భారీగా మంచు కురిసింది. మిస్సోరీలోని సెయింట్ లూయిస్‌లో 7.3 అంగుళాలు, సెయింట్ జెనెవీవ్‌లో 14 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. వెంట్జ్‌విల్లేలో ఒక ఐస్ అరేనా పైకప్పు మంచు ధాటికి కుప్పకూలింది. 

అలాగే, పశ్చిమ తీరంలోని కాలిఫోర్నియాలో భారీ అలలు, కెరటాల తీవ్రతకు తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పసిఫికా పీర్ కొంత భాగం సముద్రంలో కూలిపోగా, రైలు పట్టాలు దెబ్బతినడంతో ఆమ్‌ట్రాక్ పసిఫిక్ సర్ఫ్‌లైనర్ సేవలను నిలిపివేశారు.

ఈ విపత్తుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఫ్లోరిడా వరదలకు సంబంధించి ఇప్పటికే డిజాస్టర్ డిక్లరేషన్‌పై సంతకం చేశామని, తూర్పు తీర తుపాను నష్టంపై ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే విజ్ఞప్తులను పరిశీలిస్తామని వెల్లడించారు. తీవ్రమైన గాలులు, రాకాసి అలలు, వరదల కలయికతో లక్షలాది మంది ప్రజల పండుగ ఉత్సాహం నీరుగారిపోయింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!