E-PAPER

చిన్నపిల్లల్లో మధుమేహం..! ఈ లక్షణాలు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు..

పిల్లలు బయటకు వెళ్లి ఆడుకున్న తర్వాత దాహంతో నీళ్లు తాగడం సహజమే. కానీ ఎలాంటి కారణం లేకుండానే పదేపదే నీళ్లు తాగాలని పిల్లలు అడుగుతున్నారా? రాత్రిపూట కూడా తరచూ మూత్ర విసర్జనకు వెళ్తున్నారా? అయితే తల్లిదండ్రులు ఈ మార్పులను తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి పిల్లల్లో షుగర్ వ్యాధి తీవ్రత అంటే టైప్ 1 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు కావచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కనిపించే కొన్ని ఆరోగ్య సమస్యలను తల్లిదండ్రులు సాధారణ అలసటగా లేదా అలవాటుగా భావిస్తుంటారు. అయితే సరైన సమయంలో లక్షణాలను గుర్తించడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

పిల్లల్లో టైప్ 1 డయాబెటిస్ ఎందుకు వస్తుంది?

టైప్ 1 డయాబెటిస్ సాధారణంగా బాల్యంలోనే ప్రారంభమవుతుంది. ఈ సమస్యలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున క్లోమగ్రంథిలోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేస్తుంది. దీంతో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది లేదా పూర్తిగా ఆగిపోతుంది. ఇన్సులిన్ రక్తంలోని గ్లూకోజ్ కణాలకు చేరడానికి సహాయపడుతుంది. శరీరంలో ఇన్సులిన్ సరిపోకపోతే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అదనపు గ్లూకోజ్‌ బయటకు పంపేందుకు మూత్రపిండాలు ఎక్కువగా పనిచేస్తాయి. దీంతో శరీరంలోని నీరు కూడా మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. ఫలితంగా పిల్లలకు తరచూ దాహం వేస్తుంది.

పిల్లల్లో కనిపించే ఈ 5 లక్షణాలు గుర్తించండి

1. పదేపదే దాహం వేయడం: పిల్లలు ఎంత నీళ్లు తాగినా మళ్లీ దాహంగా ఉందని చెబుతుంటారు. ఎండలో ఆడకపోయినా, శారీరక శ్రమ చేయకపోయినా ఇలా జరుగుతుంటే గమనించాలి.

2. తరచూ మూత్ర విసర్జన: రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. పిల్లలు పగటిపూట మాత్రమే కాకుండా రాత్రిపూట కూడా పదేపదే బాత్రూమ్‌కు వెళ్తుంటారు.

Advertisement

3. అకస్మాత్తుగా బెడ్ వెట్టింగ్: ఇంతకుముందు రాత్రిపూట నిద్రలో మూత్ర విసర్జన చేయని పిల్లలు మళ్లీ అలా చేయడం. అలాంటి సందర్భంలో చిన్నపిల్లలకు డైపర్లు కూడా తరచూ మార్చాల్సి ఉంటుంది.

4. అకారణంగా బరువు తగ్గడం: సరిగ్గా తింటున్నప్పటికీ కొంతమంది పిల్లలు బరువు కోల్పోతారు. శక్తి కోసం శరీరం కొవ్వు, కండరాలను వినియోగించుకోవడం దీనికి కారణం.

5. అలసట, చిరాకు: పిల్లలు తరచూ అలసిపోవడం, చిరాకు పడటం లేదా సాధారణ ఆటల్లో కూడా ఆసక్తి చూపకపోవడం కనిపించవచ్చు.

డయాబెటిక్ కీటో అసిడోసిస్ ప్రమాదం

చికిత్స చేయని డయాబెటిస్ కొన్నిసార్లు డయాబెటిక్ కీటో అసిడోసిస్ (DKA) అనే తీవ్రమైన సమస్యకు దారితీస్తుంది. ఈ సమయంలో శరీరంలో కీటోన్స్ అనే ఆమ్లాలు పేరుకుపోతాయి. నోటి నుంచి పండ్లు లేదా అసిటోన్ వంటి వాసన రావడం, కడుపునొప్పి, వాంతులు, వేగంగా శ్వాస తీసుకోవడం, తీవ్రమైన నిద్రమత్తు దీనికి సంకేతాలు. ఇవి కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి.

పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి

పిల్లలకు అధిక దాహం, తరచూ మూత్ర విసర్జన, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైతే రక్తంలో షుగర్ లెవెల్స్, మూత్ర పరీక్షలు చేయిస్తారు. టైప్ 1 డయాబెటిస్ పిల్లలు ఎక్కువ స్వీట్లు తినడం వల్ల రాదు. ఇది రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన సమస్య. సరైన ఇన్సులిన్ చికిత్స, రక్తంలో షుగర్ చెక్ చూస్తూ ఉండడం, సమతుల్య ఆహారం, వ్యాయామంతో పిల్లలు సాధారణ జీవితాన్ని గడపవచ్చు. తల్లిదండ్రులు.. స్కూల్ టీచర్స్‌కు కూడా పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలియజేయాలి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!