E-PAPER

టెన్షన్ ఎక్కువైతే ప్రాణాల మీదకి వస్తుంది..!ఒత్తిడి వల్ల దెబ్బతినే అవయవాలు ఇవే..!

ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో టెన్షన్ ,ఆందోళన సర్వసాధారణం అయిపోయాయి. అయితే.. రోజువారీ జీవితంలో కాస్త ఒత్తిడిని ఎదుర్కోవడం సహజమే కానీ, అదే పనిగా నిరంతరం ఒత్తిడిలో మగ్గిపోతే మాత్రం అది ‘క్రానిక్ స్ట్రెస్’గా మారుతుంది. ఈ దీర్ఘ కాలిక ఒత్తిడి కేవలం మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా..మెదడు నుంచి గుండె, జీర్ణ వ్యవస్థ వరకు ప్రతి ప్రధాన అవయవాన్ని లోపలి నుంచి బలహీన పరుస్తుంది. నిత్యం ఒత్తిడికి.. గురై నప్పుడు మీ శరీరంలో అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం!

ఒత్తిడికి గురైనప్పుడు శరీరానికి ఏం జరుగుతుంది?

మనిషి ఒత్తిడికి గురైనప్పుడు శరీరం ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’మోడ్‌లోకి వెళుతుంది. ఈ సమయంలో.. మెదడు సంకేతాల మేరకు అడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లు భారీగా విడుదలవుతాయి. ఇవి తాత్కాలికంగా.. ప్రమాదాలను తట్టుకోవడానికి సహాయ పడతాయి.కానీ.. ఎల్లప్పుడూ ఇదే పరిస్థితి కొనసాగితే.. ఆ హార్మోన్ల మోతాదు పెరిగి శరీర తత్త్వాన్నే మార్చేస్తుంది. అసలు ఒత్తిడి వల్ల ఏ అవయవంపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే..

1. మెదడుపై తీవ్ర ప్రభావం:

నిరంతర ఒత్తిడి కారణంగా మెదడులోని జ్ఞాపకశక్తిని నియంత్రించే ‘హిప్పోకాంపస్’ భాగం కుంచించుకుపోతుంది. దీని వల్ల చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోవడం, ఏకాగ్రత కుదరక పోవడం, తరచూ మూడ్ స్వింగ్స్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా.. ఇది క్రమంగా తీవ్రమైన డిప్రెషన్, ఆందోళనకు దారితీస్తుంది.

2. గుండె ఆరోగ్యం క్షీణించడం:

ఒత్తిడి పెరిగినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది, రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంది. నిరంతరం ఈ ఒత్తిడి కొనసాగితే రక్తనాళాలు గట్టి పడతాయి. ఇది భవిష్యత్తులో హైపర్ టెన్షన్, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని విపరీతంగా పెంచుతుంది.

3. జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం:

“స్ట్రెస్ ఉంటే కడుపులో తిప్పినట్లు ఉంటుంది” అని పెద్దలు అంటుంటారు. ఇది నూటికి నూ శాతం నిజం. ఒత్తిడికి గురైనప్పుడు మెదడుకు, జీర్ణ వ్యవస్థకు మధ్య ఉండే గట్-బ్రెయిన్ యాక్సిస్ దెబ్బతింటుంది. దీని వల్ల ఎసిడిటీ, కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు, అజీర్తితో పాటు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన జీర్ణ సమస్యలు చుట్టుముడతాయి.

4. రోగనిరోధక శక్తి :

కార్టిసాల్ హార్మోన్ ఎక్కువైతే అది శరీరంలోని రోగ నిరోధక శక్తిని అణచి వేస్తుంది. ఫలితంగా తరచూ జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు త్వరగా సోకుతాయి. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా.. శరీరం దానితో పోరాడే శక్తిని కోల్పోతుంది. గాయాలు కూడా త్వరగా మానవు.

5.చర్మం, జుట్టుపై ప్రభావం:

నిరంతరం టెన్షన్‌లో ఉండటం వల్ల చర్మంలో సెబమ్ ఉత్పత్తి మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. అలాగే జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.

ఒత్తిడిని జయించడం ఎలా?

ఈ ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా, ధ్యానం అలవర్చుకోవడం చాలా ముఖ్యం. తగినంత నిద్ర పోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఒత్తిడిని ఈజీగా అదుపులో ఉంచుకోవచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒత్తిడిని దరిచేరనీయకండి!

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!