E-PAPER

ఎస్​ఐఆర్ పై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో మరో పిటిషన్..! ఈసీఐకి 48 ప్రశ్నలు..!

దేశవ్యాప్తంగా జరుపుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్​ఐఆర్​) ప్రక్రియలో ఏకపక్ష నిర్ణయాలు జరిగాయని, భారీ ఎత్తున ఓట్లను తొలగించారని ఆరోపిస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ)కి 48 రాతపూర్వక ప్రశ్నలు సంధించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) మిగితా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌ బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషిల ప్రమేయం లేకుండానే కమిషన్‌కు ఉన్న ఉమ్మడి అధికారాలను ఏకపక్షంగా వినియోగించారా? అన్నది ఈ వివాదంలో కీలకమని పిటిషన్​ లో పేర్కొన్నారు. దీనిపై ముగ్గురు కమిషనర్లు స్వయంగా ప్రమాణపత్రాలు దాఖలు చేయాలన్నారు. దేశవ్యాప్త ఎస్​ఐఆర్​ నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని 2025 ఆగస్టులో ఈసీఐ అధికారులే స్వయంగా ఓ సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానమిచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు.

48 ప్రశ్నల్లోని కీలక అంశాలు..

సుప్రీంకోర్టు నిబంధనలు ప్రకారం పది విభాగాల్లో 48 ప్రశ్నలను ఈసీఐకి సంధించేందుకు పిటిషనర్లు అనుమతి కోరారు. 2025 ఫిబ్రవరి నుంచి 2026 అక్టోబర్ మధ్య కాలంలో ఎస్​ఐఆర్​, ఈసీఐఎన్​ఈటీ, ఫారం-6 లేదా కోర్టు అప్పీళ్ల విషయంలో ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌ బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి ఏవైనా రాతపూర్వక అభ్యంతరాలు, భిన్నాభిప్రాయాలు నమోదు చేశారా? అన్న వివరాలను వెల్లడించాలని కోరారు.

ఓటర్ల జాబితా డేటాబేస్‌ లో మార్పులు చేసే అవకాశం ప్రైవేట్ కాంట్రాక్టర్లు లేదా వెండర్లకు ఉందా? ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల ఉత్తర్వులు లేకుండానే సామూహికంగా ఓట్ల తొలగింపు జరిగిందా? యాక్సెస్ ఆడిట్ నిర్వహించాలన్న డాక్టర్ వివేక్ జోషి ప్రతిపాదనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అన్న విషయాలపై ఈసీఐ డైరెక్టర్ జనరల్ (ఐటీ) స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వాట్సాప్ ఆమోదాలు, రాష్ట్రాల వారీ డేటా, ఆన్‌ లైన్ ఫారం-6లో కొత్త డిక్లరేషన్ చేర్చడానికి ఎవరు అనుమతించారు? ముసాయిదా, తుది జాబితాల నుంచి తొలగించిన ఓటర్ల రాష్ట్రాల వారీ డేటా ఏంది? అత్యవసర ఆమోదాలను వాట్సాప్ లేదా వ్యక్తిగత ఈ మెయిళ్ల ద్వారా పొందారా? అన్న వివరాలను వెల్లడించాలన్నారు.

ఒక సాంకేతిక వ్యవస్థను నిర్వహిస్తున్న సంస్థ వద్ద మాత్రమే ఉండే కీలక వాస్తవాలు రాజ్యాంగపరమైన సవాల్​ కు కేంద్రబిందువుగా మారినప్పుడు ఆ అధికారులను నిర్దిష్ట ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోర్టు ఆదేశించవచ్చంటూ గతంలో జస్టిస్ కె.ఎస్.పుట్టస్వామి కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పిటిషనర్లు ఉదహరించారు. ఒకవేళ ఏదైనా అధికారిక రికార్డుపై ఈసీఐ గోప్యత కోరుకుంటే ప్రతి రికార్డుకు సంబంధించి నిర్దిష్ట కారణాలను కోర్టుకు వివరించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!