పలాస: ఇచ్చాపురం, పలాస–కాశీబుగ్గ పురపాలక ఎన్నికలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఎన్నికల విధులకు నియమితులైన పోలీసు అధికారులు, సిబ్బందికి కాశీబుగ్గ డీఎస్పీ జి.వి. రమణ పలు కీలక సూచనలు చేశారు. శనివారం ఇచ్చాపురం, పలాస–కాశీబుగ్గ పట్టణాల్లో వేర్వేరుగా పోలీసు సిబ్బందితో సమావేశాలు నిర్వహించి ఎన్నికల బందోబస్తు, విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పోలింగ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రతి పోలీసు సిబ్బంది అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిని సున్నంతో గుర్తించాలని, ఆ పరిధిలో రాజకీయ పార్టీల సమావేశాలు, జెండాలు, బ్యానర్లు, కటౌట్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 200 మీటర్ల పరిధికి వెలుపల మాత్రమే తెల్ల కాగితంపై ముద్రించిన ఓటరు స్లిప్పుల పంపిణీ జరిగేలా పర్యవేక్షించాలని తెలిపారు. ఎన్నికల సంఘం ఆమోదించిన గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాతే ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని, అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని అడ్డుకోవాలని సూచించారు.
163 బీఎన్ఎస్ఎస్ (గతంలో 144 సెక్షన్) నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, నలుగురికి మించి వ్యక్తులు గుమిగూడకుండా చూడాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, బారికేడ్లు, గేట్లు తదితర భద్రతా ఏర్పాట్లను ముందుగానే తనిఖీ చేయాలని తెలిపారు. ఎన్నికల అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, ఇతర సిబ్బందితో సమన్వయం పాటిస్తూ, రిటర్నింగ్ అధికారి (ఆర్వో) ఆదేశాల మేరకే పోలింగ్ స్టేషన్లోకి వెళ్లాలని సూచించారు.
ఓటర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పించాలని, క్యూ లైన్లను క్రమబద్ధంగా నిర్వహించాలని చెప్పారు. ఏదైనా అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, రూట్ మొబైల్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
కేటాయించిన సమయానికి విధుల్లో చేరి బ్యాలెట్ బాక్సులను నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా తరలించాలని, పోలింగ్ ముగిసిన అనంతరం పోలీసు భద్రత మధ్య భద్రతా కేంద్రాలకు చేర్చాలని సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సుల భద్రతతో పాటు కౌంటింగ్ ప్రక్రియకు కూడా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ భాస్కర్ రెడ్డి, కాశీబుగ్గ, ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Y7 News Telugu | శ్రీకాకుళం జిల్లా | పలాస








