E-PAPER

తుడుందెబ్బలో జరుగుతున్నది ఆశయాల పోరాటమా? ఆధిపత్య పోరాటమా?

ఖమ్మం:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ వరకు ఆదివాసీల హక్కుల పరిరక్షణకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ‘తుడుందెబ్బ’ నేడు తీవ్ర చర్చకు కేంద్రబిందువుగా మారింది. అడవి బిడ్డల హక్కుల కోసం ప్రభుత్వాలనే ప్రశ్నించిన ఉద్యమం.. నేడు తన అసలు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందా? లేక నాయకత్వ విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు, రాజకీయ ప్రభావాల మధ్య తన దిశను కోల్పోతోందా?

ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న భూమి, విద్య, వైద్యం, ఉపాధి, అటవీ హక్కులు, మహిళల భద్రత వంటి సమస్యలపై రాజీలేని పోరాటం జరగాల్సిన సమయంలో నాయకత్వ పరిణామాలు, తెరవెనుక రాజకీయ ఒప్పందాల ఆరోపణలు క్షేత్రస్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు జాతి భవిష్యత్తు కోసం ఉద్యోగాన్ని, నెలకు లక్షల రూపాయల వేతనాన్ని సైతం వదులుకుని ఉద్యమ బాట పట్టిన చుంచు రామకృష్ణ వంటి వారు ఉంటే.. మరోవైపు ఉద్యమం పేరుతో మైనింగ్, ఇసుక అక్రమ రవాణా, గిరిజనుల భూ సమస్యలపై కాకుండా, ఎన్నికల సమయంలో రాజకీయ బేరసారాలకు మాత్రమే ఉద్యమాన్ని వాడుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి అని నాయకత్వంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉద్యమం అంటే మైకుల ముందు మంటలు పుట్టించే ప్రసంగాలు కాదు.. బాధితుడి కన్నీటిని తుడిచి, అతడి హక్కు సాధించే వరకు అండగా నిలబడటం!

జాతి పేరుతో సభలు నిర్వహించడం కాదు.. జాతి ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలను నిలదీయాలి. పదవుల కోసం పోటీ పడటం కాదు.. ప్రజల హక్కుల కోసం పోరాడాలి. లక్షలాది ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన తుడుందెబ్బ ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు.. అది ఒక జాతి ఉద్యమం.మరి నేడు తుడుందెబ్బలో జరుగుతున్నది ఆశయాల పోరాటమా? ఆధిపత్య పోరాటమా? లక్షల జీతాన్ని వదులుకున్న వారి త్యాగానికి విలువ దక్కుతుందా? లేక ఆదివాసీ ఉద్యమం రాజకీయ ప్రయోజనాల మధ్యే చిక్కుకుపోతుందా?

మారోజు వీరన్న వంటి ఉద్యమకారుల ఆలోచనల నుంచి పుట్టిన తుడుందెబ్బ ఏ ఒక్కరి సొంత జాగీరు కాదు. ఉద్యమం పేరుతో ఆస్తులు కూడబెట్టే వారు ఎవరో, లక్షల జీతాన్ని వదులుకుని జాతి కోసం నిలబడే వారెవరో గిరిజన యువతకు స్పష్టంగా అర్థమవుతోంది. రాబోయే రోజుల్లో నిజమైన ఆదివాసీ పోరాటం క్షేత్రస్థాయి నుంచే మొదలవుతుందని, ఉద్యమాన్ని వ్యాపారంగా మార్చిన వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పరిశీలకులు భావిస్తున్నారు.

ఇదే ఇప్పుడు ఆదివాసీ సమాజం ముందున్న అసలు ప్రశ్న. ఇదే ఈ ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్ ప్రధాన ఉద్దేశం.త్వరలో.. y7News telugu లో…
– పులిపాటి పాపారావు
జర్నలిస్ట్

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!