ప్రతి జిల్లాలో కనీసం 5,000 పోస్టులు భర్తీ చేయాలి.. ఎన్నికల హామీలు అమలు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం
హైదరాబాద్, అక్టోబర్ 30:
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం 5,000 వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను గుర్తించి తక్షణమే భర్తీ చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.
శుక్రవారం తెలంగాణ మహిళా సాధికారిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి బృందం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రాష్ట్ర వికలాంగుల డైరెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించిన ముట్టడి కార్యక్రమంలో గిద్దె రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ను నెలకు రూ.6,000కు పెంచుతామని, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.
అలాగే ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయడం, వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం-2016ను సమర్థవంతంగా అమలు చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం వంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని 29వ అంశంలో పొందుపరిచిందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కీలకమైనవి ఇంకా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం వికలాంగుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు
ప్రతి జిల్లాలో కనీసం 5,000 బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించి ప్రత్యేక నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో వికలాంగులకు కేటాయించిన ఉద్యోగ రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వికలాంగ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.
వికలాంగుల కోసం ప్రత్యేక సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని, వికలాంగుడైన వ్యక్తినే వికలాంగుల కమిషనర్గా నియమించాలని, వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం-2016ను సమర్థవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
కొడంగల్ నుంచే ఉద్యమం ప్రారంభిస్తాం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే నెరవేర్చాలని గిద్దె రాజేష్ హెచ్చరించారు. లేనిపక్షంలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నుంచే వికలాంగులను పెద్ద ఎత్తున సమీకరించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేసి కొడంగల్లో ముఖ్యమంత్రికి డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని విస్తరిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పలు వికలాంగుల సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








