E-PAPER

కేంద్రం కీలక ప్రకటన..! 2032 అక్టోబర్‌ నుండి కార్లలో ఆటోమేటిక్ బ్రేకింగ్ తప్పనిసరి..!

రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. కార్లలో ‘అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌’ (ఏడీఏఎస్‌)లో భాగమైన ‘ఆటోమేటిక్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ సిస్టమ్‌’ (ఏఈబీఎస్‌)ను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. 2032 అక్టోబర్‌ 1 నుంచి ఎం1 కేటగిరీకి చెందిన అన్ని కార్లలో ఈ వ్యవస్థ ఉండేలా నిబంధనలు తీసుకురావాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. దీనికి సంబంధించి కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989కు సవరణలతో ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను 30 రోజుల్లోగా తెలియజేయవచ్చు.

ఏఈబీఎస్‌ ఎలా పనిచేస్తుంది?
డ్రైవర్‌ ముందున్న ప్రమాదాన్ని గుర్తించి సకాలంలో బ్రేకులు వేయకపోతే ఏఈబీఎస్‌ వ్యవస్థ ఆటోమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది. తద్వారా ప్రమాదాన్ని నివారించడం లేదా ఢీకొన్నప్పుడు జరిగే నష్ట తీవ్రతను తగ్గించడం దీని ఉద్దేశం. 

ముసాయిదా ప్రకారం.. 2028 అక్టోబర్‌ 1 నుంచి ఏఈబీఎస్‌తో వచ్చే ఎం1 కేటగిరీ కార్లు, ఎన్‌1 కేటగిరీ తేలికపాటి సరుకు రవాణా వాహనాలు ఏఐఎస్‌-185 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. 2030 అక్టోబర్‌ 1 నుంచి కొత్తగా తయారయ్యే ఎం1 కార్లలో ఈ వ్యవస్థ తప్పనిసరి కానుంది. 

2032 అక్టోబర్‌ 1 నుంచి, ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న మోడళ్లతో సహా అన్ని ఎం1 కార్లకు ఈ నిబంధన వర్తించనుంది. ఎం1 కేటగిరీ కింద డ్రైవర్‌తో కలిపి గరిష్ఠంగా 8 మంది ప్రయాణికులు కూర్చునే సీట్లు ఉన్న వాహనాలు వస్తాయి. హ్యాచ్‌బ్యాక్‌ కార్లు, సెడాన్లు, ఎస్‌యూవీలు, ఎంయూవీలు వంటి సాధారణ ప్యాసింజర్‌ కార్లు ఈ కేటగిరీలో ఉంటాయి.

స్టీరింగ్‌, లేన్‌ కీపింగ్‌ వ్యవస్థలకూ నిబంధనలు
2027 అక్టోబర్‌ 1 నుంచి మోటారు వాహనాల్లో స్టీరింగ్‌ వ్యవస్థకు సంబంధించిన ప్రమాణాలను ఏఐఎస్‌-193 ప్రకారం అమలు చేయాలని ప్రతిపాదించారు. అయితే స్టీరింగ్‌ వీల్‌ లేని మోటార్‌సైకిళ్లు, దివ్యాంగుల కోసం రూపొందించిన వాహనాలు, మూడు చక్రాల వాహనాలకు మినహాయింపు ఇవ్వనున్నారు. ఆటోమేటిక్‌ కమాండ్‌ స్టీరింగ్‌ ఫంక్షనాలిటీస్‌ (ఏసీఎస్‌ఎఫ్‌) ఉన్న ఎం1 కార్లు కూడా సంబంధిత ప్రమాణాలను పాటించాలి. 

ఎమర్జెన్సీ లేన్‌ కీపింగ్‌ సిస్టమ్‌ (ఈఎల్‌కేఎస్‌) ఉన్న వాహనాలకు ఏఐఎస్‌-191 (పార్ట్‌ 1) ప్రమాణాలు వర్తిస్తాయి. 2029 అక్టోబర్‌ 1 నుంచి రవాణా వాహనాలుగా నమోదయ్యే ఎం1 కార్లలో ఏసీఎస్‌ఎఫ్‌, ఈఎల్‌కేఎస్‌ వ్యవస్థలను తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు. డ్రైవర్‌ నిద్రమత్తు, అప్రమత్తతను గుర్తించి హెచ్చరించే వ్యవస్థలనూ వీటిలో ప్రవేశపెట్టే ప్రతిపాదన ఉంది.

ట్రక్కులు, బస్సులకూ భద్రతా ఫీచర్లు
వాణిజ్య వాహనాల భద్రతను పెంచేందుకు కూడా కేంద్రం పలు మార్పులను ప్రతిపాదించింది. 2027 జనవరి నుంచి కొత్త ట్రక్కులు, బస్సుల మోడళ్లలో ఆటోమేటిక్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌తో పాటు బ్లైండ్‌ స్పాట్‌ సమాచారం, వాహనం కదలడం ప్రారంభించినప్పుడు హెచ్చరికలు, డ్రైవర్‌ నిద్రమత్తును గుర్తించే వ్యవస్థ, లేన్‌ నుంచి పక్కకు వెళ్లినప్పుడు హెచ్చరించే సాంకేతికతను తప్పనిసరి చేయనున్నారు. 

2027 అక్టోబర్‌ 1 నుంచి ట్రక్కులకు సవరించిన బ్రేకింగ్‌ ప్రమాణాలతో పాటు ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (ఈఎస్‌సీ)ను అమలు చేయాలని ప్రతిపాదించారు. అలాగే 2028 అక్టోబర్‌ 1 నుంచి కొత్తగా తయారయ్యే అన్ని వాహనాల్లో వెహికల్‌-టు-వెహికల్‌ (వీ2వీ) కమ్యూనికేషన్‌ వ్యవస్థను తప్పనిసరి చేయాలని ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ సాంకేతికత ద్వారా వాహనాలు తమ వేగం, స్థానం, ప్రయాణ దిశ వంటి సమాచారాన్ని పరస్పరం పంచుకోగలవు. 

ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత కేంద్రం తుది నిబంధనలను ఖరారు చేయనుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!