E-PAPER

వయసును కంట్రోల్ చేసే శక్తి ఆహారానికి ఉందా..? ఏ డైట్ బెస్ట్..?

వయసు పెరుగుదలను నియంత్రించి, యవ్వనంగా కనిపించడం కోసం చాలామంది రకరకాల డైట్‌లను అనుసరిస్తుంటారు. అయితే, ఏదో ఒక ‘మ్యాజిక్ డైట్’ పాటించడం కంటే, స్థిరంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కొనసాగించడమే కీలకమని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. ‘నేచర్ కమ్యూనికేషన్స్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన, వృద్ధాప్య వేగాన్ని తగ్గించడంలో ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతను శాస్త్రీయంగా వివరించింది.

జర్మన్ సెంటర్ ఫర్ న్యూరోడీజనరేటివ్ డిసీజెస్ (DZNE), జర్మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రిషన్, మరియు బాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. వారు సుమారు 7,500 మంది వయోజనుల ఆహారపు అలవాట్లను, రక్త నమూనాలను విశ్లేషించారు. ఇందులో కాలక్రమేణా వచ్చే వయసు (Chronological Age) కాకుండా, శరీరం లోపల కణాల స్థాయిలో జరిగే వృద్ధాప్య ప్రక్రియను సూచించే “జీవ సంబంధ వయసు” (Biological Age)ను కొలిచారు. ఇందుకోసం డీఎన్ఏపై ఉండే రసాయన మార్పులను (DNA Methylation) గుర్తించే “ఎపిజెనెటిక్ క్లాక్స్” అనే అధునాతన పద్ధతిని ఉపయోగించారు.

ఏ డైట్ పాటించినా ఫలితం ఒక్కటే

పరిశోధకులు సుమారు 10 రకాల ప్రసిద్ధ ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను విశ్లేషించారు. వీటిలో మధ్యధరా డైట్, నార్డిక్ డైట్, మొక్కల ఆధారిత డైట్లు (Plant-Based Diets), అధిక రక్తపోటును నియంత్రించే డాష్ (DASH) డైట్, మెదడు ఆరోగ్యం కోసం రూపొందించిన మైండ్ (MIND) డైట్ వంటివి ఉన్నాయి. ఆశ్చర్యకరంగా, ఈ పద్ధతుల్లో ఏ ఒక్కదానికో కట్టుబడిన వారందరిలోనూ జీవసంబంధ వృద్ధాప్య వేగం నెమ్మదించినట్లు గుర్తించారు.

అంటే, ఫలానా డైట్ మాత్రమే గొప్పదని చెప్పలేమని, ఏ రకమైన ఆరోగ్యకరమైన ఆహార పద్ధతిని స్థిరంగా పాటించినా సానుకూల ఫలితాలు ఉంటాయని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ డైట్లన్నీ వేర్వేరుగా కనిపించినప్పటికీ, శరీరంపై అవి చూపించే ప్రభావంలో 70 శాతానికి పైగా సారూప్యత ఉన్నట్లు కనుగొన్నారు. ఇవన్నీ కణాల జీవక్రియ, నిర్మాణం, కమ్యూనికేషన్ వంటి కీలకమైన ప్రక్రియలను మెరుగుపరుస్తున్నట్లు తేలింది.

ధూమపానం చేసేవారిలో ఆసక్తికర ఫలితం

ఈ అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యకరమైన ఆహారం, జీవసంబంధ వయసు తగ్గడానికి మధ్య ఉన్న సంబంధం ధూమపానం చేసేవారిలో మరింత బలంగా కనిపించింది. దీనికి కారణం, ధూమపానం వల్ల వారి శరీరంలో అప్పటికే అధిక ఒత్తిడి ఉండటం వల్ల, మంచి ఆహారం తీసుకున్నప్పుడు మెరుగుదలకు ఎక్కువ ఆస్కారం ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే, మంచి ఆహారం తింటున్నాం కదా అని ధూమపానం వల్ల కలిగే తీవ్ర నష్టాలను విస్మరించకూడదని, పొగాకును మానేయడమే అత్యంత కీలకమని వారు గట్టిగా హెచ్చరించారు.

మొత్తంమీద ఈ అధ్యయనం ఇచ్చే సందేశం ఒక్కటే. ఖరీదైన, దిగుమతి చేసుకున్న ఫుడ్స్ లేదా కఠినమైన డైట్ల వెంట పడాల్సిన అవసరం లేదు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారాన్ని తమ బడ్జెట్, సంస్కృతికి అనుగుణంగా ఎంచుకుని, స్థిరంగా పాటిస్తే చాలు… జీవ గడియారాన్ని నెమ్మదిగా కదిలేలా చేయవచ్చని ఈ పరిశోధన భరోసా ఇస్తోంది. అయితే, ఇది కేవలం పరిశీలనాత్మక అధ్యయనం మాత్రమేనని, ఆహార మార్పులే వయసు వేగాన్ని తగ్గిస్తాయని కచ్చితంగా నిర్ధారించలేదని పరిశోధకులు పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!