పినపాక
పినపాక మండలం ఈ.బయ్యారం గ్రామానికి చెందిన శ్రీరామ్ నివేదన్ నీట్‌లో ప్రభుత్వ సీటు సాధించి వైద్య విద్యలో ప్రవేశం పొందడం పట్ల పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నివేదన్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
కష్టపడి చదివి నీట్‌లో ప్రభుత్వ సీటు సాధించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. నివేదన్ సాధించిన విజయం ఆయన తల్లిదండ్రులు ప్రముఖ రిపోర్టర్ శ్రీరామ్ బృహస్పతి, లతతో పాటు కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా ఈ.బయ్యారం గ్రామం, పినపాక ప్రాంతానికే గర్వకారణమని పేర్కొన్నారు.విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఎమ్మెల్యే అన్నారు. నివేదన్ వైద్య విద్యలో రాణించి భవిష్యత్తులో మంచి వైద్యుడిగా ఎదిగి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నివేదన్‌కు అభినందనలు తెలియజేయడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.








