ములుగు, సెప్టెంబర్ 29 (Y7 న్యూస్): ములుగు జిల్లా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ములుగు ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, క్రైమ్ నం.135/2021లో సెక్షన్ 366, 376(2)(n) ఐపీసీతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 5(1) రీడ్ విత్ 6 కింద నమోదైన కేసులో రామానుజాపూర్ గ్రామానికి చెందిన పల్లెబోయిన క్రాంతి (27)ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు ములుగు ప్రత్యేక పోక్సో కోర్టు ప్రిన్సిపల్ జిల్లా & సెషన్స్ జడ్జి శ్రీమతి ఎస్.వి.పి. సూర్య చంద్రకళ నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.7,000 జరిమానా విధించారు.
ఈ కేసులో అప్పటి ఎస్ఐ డి. రమేష్ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, డబ్ల్యూఎస్ఐ పి. రాధిక దర్యాప్తు పురోగతికి అనుగుణంగా సెక్షన్లు మార్చారు. తొలి దర్యాప్తు అధికారిగా పి. సాయి చైతన్య ఐపీఎస్, రెండో దర్యాప్తు అధికారిగా అప్పటి ములుగు ఏఎస్పీ, ప్రస్తుత జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ ఐపీఎస్ వ్యవహరించారు.
కోర్టు విచారణ సమయంలో కేసు సమన్వయం, ప్రాసిక్యూషన్ నిర్వహణలో డీఎస్పీ కిషోర్, కోర్టు లైజనింగ్ అధికారి ఏఎస్ఐ ఎల్. కుమారస్వామి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి. రామ్‌సింగ్, సీడీఓలు జె. శ్రీను, వై. శ్రవంతి తదితరులు కీలక పాత్ర పోషించారు.
కేసు దర్యాప్తు, కోర్టు సమన్వయం, ప్రాసిక్యూషన్ ప్రక్రియలో కృషి చేసిన అధికారులను ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ అభినందించారు. బాధితులకు న్యాయం జరిగేలా నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి, సమన్వయంతో పనిచేయాలని పోలీసు అధికారులకు సూచించారు.








