అఖండ యూనివర్సల్ వెల్ఫేర్ ట్రస్ట్ సేవా కార్యక్రమం
కరకగూడెం, సెప్టెంబర్ 29 (Y7 న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని అశ్వాపురంపాడు ఆదివాసి గ్రామంలో అఖండ యూనివర్సల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దోమతెరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కట్ల నరేష్ మాట్లాడుతూ, ఆదివాసి ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసం ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్య, ఆరోగ్యం, ఆహార భద్రత వంటి అంశాలపై మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వెంకటేష్, రవితో పాటు గ్రామ పెద్దలు మడవి ఉంగయ్య, పొడియం మంగయ్య, దేవేందర్ పొడియం పాల్గొని గ్రామస్థులకు దోమతెరలు పంపిణీ చేశారు.
గ్రామస్థులు ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలను మరింత విస్తరించాలని కోరారు.









