E-PAPER

మణుగూరులో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్

మణుగూరు, సెప్టెంబర్ 26 (Y7 News Telugu): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణ ప్రవేశం వద్ద ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆమె 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మన రజక కుటుంబాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానికులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ.. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం సమానత్వం, సమాన న్యాయం ఉన్నప్పటికీ రజకుల విషయంలో వివక్ష కొనసాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చారని, తెలంగాణలో మాత్రం బీసీ వర్గంలో కొనసాగుతున్నారని నాయకులు పేర్కొన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని గతంలో పలువురు నాయకులు, అధికారులకు వినతులు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు.

ఇకనైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

రజకుల సామాజిక సేవలను గుర్తించాలని నాయకులు కోరారు. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు శుభ, అశుభ కార్యక్రమాల్లో రజకుల సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. రజకులను కేవలం పనివారిగా చూసే దృక్పథం మారాలని, కుల వివక్షకు తావులేకుండా సమాన గౌరవం కల్పించాలని కోరారు.

శుచిశుభ్రత, పరిశుభ్రతలో రజకుల పాత్ర ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మన రజక కుటుంబాల ఐక్యవేదిక సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో రజక కులస్తులు, స్థానికులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!