భద్రాచలం, సెప్టెంబర్ 24: భద్రాచలం డివిజన్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట సూచించారు. గోదావరి నది నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున గురువారం నుంచి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఒక ప్రకటనలో తెలిపారు.
అత్యవసరమైతే తప్ప అనవసర ప్రయాణాలను నివారించాలని సూచించారు. చెరువులు, కుంటలు, కాలువలు, వాగులు, నదులు తదితర నీటి వనరుల వద్దకు వెళ్లవద్దని, చేపలు పట్టడం, ఈత కొట్టడం, స్నానం చేయడం వంటి వాటి కోసం నీటిలోకి దిగకూడదని హెచ్చరించారు.
పిల్లలు నీటి వనరుల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, కాజ్‌వేలు, నీరు ప్రవహించే రహదారుల వద్ద అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
అధికారులు జారీ చేసే సూచనలు, ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. తెగిపడిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని సూచించారు.
ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సబ్ కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.









