సుగంధ ద్రవ్యాలలో ఒకటైన లవంగాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్లు, ఖనిజాలు, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలో లవంగాలలో ఇతర ఆహార పదార్థాల కంటే మూడు రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నట్లు Harvard Health Publishing పేర్కొంది. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు లవంగాలను 1100 కంటే ఎక్కువ ఇతర ఆహార పదార్థాలతో పోల్చి చూశారు. ఈ క్రమంలోనే లవంగాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : లవంగాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని అంటున్నారు. భోజనం తర్వాత ఒకటి లేదా రెండు లవంగాలను నమలడం వల్ల సహజంగానే జీర్ణక్రియ మెరుగవుతుందని తెలియజేస్తున్నారు.
నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : లవంగాలలో ‘యూజినాల్’ అనే సహజ క్రిమినాశక పదార్థం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడి, దుర్వాసనను దూరం చేస్తుందని అంటున్నారు. వీటిని క్రమం తప్పకుండా నమలడం వల్ల పంటి నొప్పి, చిగుళ్ల ఇన్ఫెక్షన్లు రాకుండా నిరోధించవచ్చని పేర్కొంటున్నారు. నోటి పరిశుభ్రతను మెరుగుపరచుకోవచ్చని తెలియజేస్తున్నారు. లవంగాలలోని శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. చిగుళ్ల వ్యాధి, పంటి నొప్పులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తాయని International Journal of Creative Research Thoughts పేర్కొంది.
జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుంది : లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయని చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా, తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి చురుగ్గా మారడంతోపాటు మానసిక స్పష్టత, అప్రమత్తత మెరుగవుతాయని తెలియజేస్తున్నారు.
గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది : లవంగాలు శరీరంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయంటున్నారు. వీటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు రక్త ధమనులను రక్షించడమే కాకుండా, మొత్తం గుండె పనితీరును మెరుగుపరుస్తాయని పేర్కొంటున్నారు.
రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది : లవంగాలలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయట. తద్వారా సాధారణ జలుబు, ఫ్లూ, కాలానుగుణంగా వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయని అంటున్నారు.
శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం : లవంగాలు ఊపిరితిత్తులలో కఫం పేరుకుపోకుండా క్లియర్ చేయడానికి, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి సహజంగా కఫాన్ని బయటకు నెట్టే పదార్థం లాగా పనిచేస్తాయంటున్నారు. దీనివల్ల బ్రాంకైటిస్, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నివారణలో ఇవి సమర్థవంతంగా తోడ్పడతాయని వివరిస్తున్నారు.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది : లవంగాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారికి, తమ చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడానికి ఎంతగానో మేలు చేస్తుందని
నోట్ : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.







