E-PAPER

వృద్ధాప్యంలో తగ్గుతున్న శారీరక బలం! – “ప్రొటీన్ లోపమే” అసలు కారణమా..?

కండరాలు, కణజాలాల బలానికి, శరీర మరమ్మతులకు ప్రొటీన్ ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన ఆధారం. అయితే, వయసు పెరిగే కొద్దీ ప్రొటీన్‌ను ఉపయోగించుకునే సామర్థ్యం శరీరానికి క్రమంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల, గతంలో మనం తీసుకున్న అంతే పరిమాణంలోని ఆహారం ఇప్పుడు శరీరానికి సరిపోకపోవచ్చంటున్నారు. ఈ మార్పు మొదట్లో చాలా నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ… కాలక్రమేణా ఇది మన శారీరక బలం, కదలికలు, దీర్ఘకాలిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

ప్రొటీన్ రెసిస్టెన్స్ అంటే : మనం తీసుకునే ప్రొటీన్‌కు శరీరం మునుపటిలా సమర్థవంతంగా స్పందించకపోవడమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా చిన్న వయస్సులో.. శరీరం మనం తినే ప్రోటీన్‌ను చాలా వేగంగా గ్రహించి కండరాల నిర్మాణానికి ఉపయోగించుకుంటుందని అంటున్నారు. కానీ, వయసు పెరిగే కొద్దీ ఈ ప్రక్రియ మందగిస్తుందని తెలియజేస్తున్నారు. దీంతో శరీరం ప్రొటీన్‌ను సరిగ్గా వాడుకోలేని స్థితి ఏర్పడుతుందని వివరిస్తున్నారు. దీనినే “ప్రొటీన్ రెసిస్టెన్స్” లేదా “అనాబాలిక్ రెసిస్టెన్స్” అంటారంటున్నారు.

సాధారణంగా చెప్పాలంటే.. మునుపటిలా కండరాలు బలంగా ఉండాలన్నా లేదా కొత్తగా కండరాల నిర్మాణం జరగాలన్నా.. ఇప్పుడు శరీరానికి ఎక్కువ ప్రొటీన్ అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, దీని అర్థం రాత్రికి రాత్రే ఆహార అలవాట్లను పూర్తిగా మార్చేసుకోవాలని కాదట. వయసుతో పాటు శరీరంలో వచ్చిన మార్పును అర్థం చేసుకోవడం ముఖ్యమని వివరిస్తున్నారు. వయసుతో పాటు శరీరంలో ప్రొటీన్ జీవక్రియలు ఎలా మారుతాయో ICMR స్పష్టంగా పేర్కొంది. వృద్ధాప్యంలో ప్రొటీన్​ను గ్రహించే శక్తి తగ్గడం వల్లే, వారి రోజువారీ ప్రొటీన్​ అవసరాల పరిమాణాన్ని సవరించాలని తెలిపింది.

సార్కోపీనియా : వయసుతో పాటు వచ్చే ఒక నిశ్శబ్ద కండరాల నష్టం. వృద్ధాప్యం అనేది శరీరంలో కేవలం ప్రొటీన్ సామర్థ్యాన్నే కాకుండా, క్రమంగా కండరాల ద్రవ్యరాశిని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కండరాల క్షీణత ఎప్పుడు మొదలవుతుంది? : ఈ కండరాల క్షీణత సాధారణంగా 30 ఏళ్ల వయసులోనే ప్రారంభమై, 60 ఏళ్ల తర్వాత మరింత వేగవంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రారంభ లక్షణాలు : దీని ప్రభావం మొదట్లో స్పష్టంగా కనిపించకపోవచ్చు. అయితే, చేతి పట్టు తగ్గిపోవడం, నడక వేగం మందగించడం లేదా మెట్లు ఎక్కడంలో ఇబ్బంది పడటం లాంటి లక్షణాలతో ఇది బయటపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

దీర్ఘకాలిక ప్రభావాలు : కాలక్రమేణా ఇది శరీర బ్యాలెన్స్ కోల్పోవడానికి, నడుస్తున్నప్పుడు కిందపడే ప్రమాదాలు పెరగడానికి, ఇతరులపై ఆధారపడే పరిస్థితికి దారితీస్తుందని clevelandclinic పేర్కొంది.

మనం తీసుకునే ప్రొటీన్ పరిమాణం ఒకేలా ఉన్నప్పటికీ, వయసు పెరిగే కొద్ది కండరాలలో ప్రొటీన్ సంశ్లేషణ క్రమంగా తగ్గిపోతుందని National Library of Medicine పేర్కొంది.

వయసు మళ్లిన శరీరాలకు ప్రోటీన్ ఎందుకు ఎక్కువ అవసరం? : కండరాల సామర్థ్యం తగ్గడం, ద్రవ్యరాశి కోల్పోవడం అనే ఈ రెండు ప్రక్రియలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు.. వృద్ధులకు ప్రొటీన్ ఎందుకు ఎక్కువ అవసరమో స్పష్టంగా అర్థమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సామర్థ్య లోపం, కండరాల నష్టం రెండూ కలిసి శరీరంలో ప్రొటీన్ డిమాండ్​ను మరింత పెంచుతాయని అంటున్నారు.

ఈ క్రమంలో శారీరక మార్పుల వల్ల వయసు పైబడిన వారికి ప్రతి కిలోగ్రామ్ బరువుకు 1.0 నుంచి 1.2 గ్రాముల ప్రొటీన్ అవసరమవుతుందని వివరిస్తున్నారు. అంతేకాకుండా, వారి జీవక్రియ, శరీర నిర్మాణం, ఏదైనా అనారోగ్యం లేదా సర్జరీల నుంచి కోలుకునే సమయాన్ని బట్టి ఈ అవసరం కిలోగ్రాముకు 1.5 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువకు కూడా పెరగవచ్చని అంటున్నారు.

కేవలం ప్రోటీన్ ఆహారం మాత్రమే ఎందుకు సరిపోదు? : వయసు పైబడిన వారిలో కేవలం ప్రొటీన్ ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే సమయం, దాని నాణ్యత కూడా అంతే ముఖ్యమంటున్నారు నిపుణులు.

ఆహారాన్ని విభజించి తీసుకోవడం : వృద్ధాప్యంలో శరీరం ఒకేసారి ఎక్కువ మొత్తంలో ప్రోటీన్‌ను శోషించుకోలేదని నిపుణులు చెబుతున్నారు. అందుకే, రోజువారీ ఆహారంలో ప్రొటీన్​ను సమానంగా విభజించి తీసుకున్నప్పుడు మాత్రమే శరీరం దానికి మెరుగ్గా స్పందిస్తుందని అంటున్నారు.

శారీరక శ్రమతో అనుసంధానం : ప్రొటీన్ ఆహారంతో పాటు శారీరక శ్రమను జత చేయడం చాలా ముఖ్యం. రెసిస్టెన్స్ వ్యాయామాలు చేయడం మంచిదట. దీంతో శరీరం ప్రొటీన్​ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి : ఆహారం శరీరానికి అవసరమైన నిర్మాణ భాగాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ, శారీరక శ్రమ మాత్రమే ఆ భాగాలను ఎక్కడ ఉపయోగించాలో శరీరానికి సంకేతాలను ఇస్తుందని అంటున్నారు.

ప్రొటీన్ రెసిస్టెన్స్ : ప్రొటీన్ రెసిస్టెన్స్ అనేది ఒక వ్యాధి కాదు. ఇది వృద్ధాప్యంలో శరీరంలో వచ్చే ఒక సహజమైన మార్పు మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. కానీ, దీనిని నిర్లక్ష్యం చేస్తే అది తీవ్ర శారీరక బలహీనత, నిరంతర అలసట, ఏదైనా అనారోగ్యం నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం వంటి సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రతిపూట ఆహారంలో ప్రొటీన్ : కేవలం మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంలోనే కాకుండా, ఉదయం బ్రేక్​ఫాస్ట్​తో సహా ప్రతి పూట తీసుకునే ఆహారంలోనూ ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.

నాణ్యమైన ప్రొటీన్ వనరులు : పప్పుధాన్యాలు, పాల పదార్థాలు, గుడ్లు, లీన్ మీట్స్, నట్స్ వంటి నాణ్యమైన ప్రొటీన్​ ఆహారాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

క్రమం తప్పని శారీరక శ్రమ : కండరాలను బలంగా ఉంచుకోవడానికి భారీ వర్కవుట్లు అవసరం లేదంటున్నారు నిపుణులు. కనీసం సాధారణ స్ట్రెంత్ వ్యాయామాలతోనైనా.. ఆరోగ్యంగా ఉంచవచ్చని సూచిస్తున్నారు.

నోట్ : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!