E-PAPER

ఆర్థిక వృద్ధిలో భారత్‌ జోరు.. వచ్చే ఏడాదిపై వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం కీలక అంచనా..

భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మరో సానుకూల అంచనా వెలువడింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ జీడీపీ వృద్ధి 6.7 శాతంగా ఉండొచ్చని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) చీఫ్‌ ఎకనామిస్ట్స్‌ ఔట్‌లుక్‌ నివేదిక తెలిపింది. దేశీయ డిమాండ్‌ బలంగా కొనసాగడం వృద్ధికి ప్రధాన కారణంగా పేర్కొంది.

సెప్టెంబర్‌ 2026 నివేదిక కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన 92 మంది చీఫ్‌ ఎకనామిస్టుల అభిప్రాయాలను సేకరించారు. వీరిలో 74 శాతం మంది భారత్‌లో ఆర్థిక వృద్ధి బలంగా లేదా చాలా బలంగా ఉంటుందని అంచనా వేశారు. మే నెలలో ఈ అభిప్రాయం 52 శాతంగా ఉంది. వచ్చే 12 నెలల్లో భారత్‌ వృద్ధి మోస్తరుగా లేదా అంతకంటే మెరుగ్గా ఉంటుందని 98 శాతం మంది భావించారు.

ఉద్యోగాల విషయానికొస్తే.. వచ్చే 12 నెలల్లో నిరుద్యోగితలో మార్పు ఉండదని 70 శాతం మంది అంచనా వేశారు. ఆగస్టులో 15 ఏళ్లు పైబడిన వారి నిరుద్యోగిత రేటు 5 శాతానికి తగ్గింది. జులైలో ఇది 5.1 శాతంగా ఉంది. ఇదే సమయంలో లేబర్‌ ఫోర్స్‌ పార్టిసిపేషన్‌ రేటు 55.4 శాతం నుంచి 55.6 శాతానికి పెరిగింది.

ద్రవ్యోల్బణంపై కూడా అంచనాలు కొంత మెరుగయ్యాయి. వచ్చే ఏడాది భారత్‌లో ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయిలో ఉంటుందని 55 శాతం మంది ఎకనామిస్టులు భావించారు. 45 శాతం మంది మాత్రం అధికంగా ఉంటుందని అంచనా వేశారు. ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.8 శాతానికి చేరింది. ఇది ఆర్‌బీఐ లక్ష్యమైన 4 శాతానికి మించి ఉంది. అయితే 2-6 శాతం పరిమితిలోనే కొనసాగుతోంది.

ద్రవ్య విధానంలో మార్పు ఉండదని 67 శాతం మంది అంచనా వేశారు. ఆగస్టులో పాలసీ రేటును 5.25 శాతం వద్దే కొనసాగించారు. ఈ నివేదిక సర్వే ఆగస్టు 20న పూర్తయింది. ఆ తర్వాత ఆగస్టు 31న విడుదలైన గణాంకాల్లో 2026-27 తొలి త్రైమాసికంలో భారత్‌ జీడీపీ వృద్ధి 7.8 శాతంగా నమోదైంది. దీంతో పలు సంస్థలు తమ వృద్ధి అంచనాలను పెంచుతున్నాయి. మూడీస్‌ కూడా తన అంచనాను 6 శాతం నుంచి 7 శాతానికి పెంచింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!