E-PAPER

ఓటు హక్కు రక్షణే ప్రజాస్వామ్యానికి పునాది: BLAలతో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం – ఎమ్మెల్యే జారె ఆదినారాయణ


కొత్తగూడెం, ఆగస్టు 22 (వై7 న్యూస్): ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి ఓటును రక్షించడం ద్వారా పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (SIR)లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.

శనివారం కొత్తగూడెం క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ BLAలు, ఇన్‌చార్జ్‌లు, కోఆర్డినేటర్లు పాల్గొన్న విస్తృత స్థాయి సమీక్షా సమావేశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న సమక్షంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత నెల రోజులుగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి బూత్‌లో చురుకుగా పనిచేసిన BLAలను అభినందించారు. మొదటి దశ అనంతరం ప్రారంభమైన రెండో దశలో పూర్తి చేయాల్సిన దరఖాస్తులు, పాటించాల్సిన నిబంధనలపై పూర్తి అవగాహనతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ఓటర్లను గుర్తించి వారి ఓటు హక్కు పరిరక్షణ కోసం ఇంటింటికీ వెళ్లి పరిశీలనలు నిర్వహించాలని, ఓటర్ల వివరాల సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా చూడాలని ఆదేశించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన సాధనమని పేర్కొంటూ, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటూ ప్రజలను కాంగ్రెస్ పార్టీతో అనుసంధానంగా ఉంచాలని సూచించారు.

ఈ సమావేశంలో డీసీసీ సభ్యులు, ఆత్మ కమిటీ చైర్మన్ వీరభద్రం, BLA ఇన్‌చార్జ్‌లు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!