వాట్సాప్ ఖాతాలను స్వాధీనం చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు చేస్తున్న మాల్వేర్ దాడిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) చేపట్టిన సమన్వయ చర్యల ద్వారా ఇప్పటివరకు 10 వేలకు పైగా భారతీయులను ఈ సైబర్ మోసం నుంచి రక్షించినట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
సహయోగ్ పోర్టల్ ద్వారా మాల్వేర్కు సంబంధించిన కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్లను భౌగోళికంగా నిరోధించినట్లు కేంద్రం తెలిపింది. దీంతో పాటు సైబర్ మోసాన్ని అడ్డుకునేందుకు పలు సాంకేతిక చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో వాట్సాప్ ఖాతాలను స్వాధీనం చేసుకునేందుకు సంబంధించిన ఫిర్యాదులు గణనీయంగా పెరగడంతో I4C అప్రమత్తమైంది.
సైబర్ నేరగాళ్లు మాల్వేర్ ద్వారా వినియోగదారుల వాట్సాప్ ఖాతాలను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పద లింకులు, ఫైళ్లు, సందేశాలను క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సైబర్ భద్రత నిపుణులు సూచిస్తున్నారు. WhatsApp ఖాతాకు సంబంధించిన OTP, వెరిఫికేషన్ కోడ్ వంటి వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోకపోవడం ద్వారా ఇలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.








