దేశ యువత సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ‘వికసిత్ భారత్’ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐఐటీ దిల్లీ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని విద్యార్థులకు భవిష్యత్తుపై పలు సూచనలు చేశారు.
వేగంగా మారుతున్న ప్రపంచంలో సాంకేతికత విప్లవాత్మకంగా మారుతోందని మోదీ పేర్కొన్నారు. రాబోయే 20–30 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో కచ్చితంగా అంచనా వేయడం కష్టమని అన్నారు. కొత్త సాంకేతికతలు, ఆవిష్కరణలు ప్రతి రంగంలోనూ వేగంగా మార్పులు తీసుకొస్తున్నాయని తెలిపారు.
అందుకే జీవితాంతం కుతూహలంతో నిత్య విద్యార్థిలా కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండేవారే భవిష్యత్తులో విజయవంతమవుతారని ప్రధాని మోదీ అన్నారు. విద్యార్థులు తమ జ్ఞానాన్ని దేశ ప్రగతికి ఉపయోగించాలని, ఆవిష్కరణలు మరియు సాంకేతికత ద్వారా సమాజానికి మేలు చేసేలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.








