రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రామాయణ’ విడుదల తేదీపై నిర్మాత నమిత్ మల్హోత్రా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే రెండు మార్కెట్లలో వేర్వేరు తేదీల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లలో సినిమాలు సాధారణంగా శుక్రవారం విడుదలవుతుండటంతో నవంబర్ 6న ‘రామాయణ’ను ఓవర్సీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నమిత్ మల్హోత్రా వెల్లడించారు. ఇక భారతదేశంలో పండుగ సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని దీపావళి రోజైన నవంబర్ 8న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
ఇక సినిమాలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే కనిపించనున్నారు. ఆస్కార్ విజేతలు ఏ.ఆర్. రెహమాన్, హన్స్ జిమ్మర్ కలిసి చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. భారత్‌లో ధర్మ ప్రొడక్షన్స్ పంపిణీ బాధ్యతలు చేపట్టగా, ఓవర్సీస్ హక్కులను సోనీ పిక్చర్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సంగీత హక్కులను టీ-సిరీస్ రూ.75 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.








