ప్రముఖ చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ హోల్డింగ్ చైర్మన్ జో సాయ్, ఆయన భార్య క్లారా వూ సాయ్ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దాదాపు 30 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ఈ వార్త ప్రస్తుతం అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే తమ వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఈ నిర్ణయం వ్యాపార కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపదని జో సాయ్, క్లారా వూ సాయ్ స్పష్టం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా అలీబాబా గ్రూప్‌తో పాటు తాము నిర్వహిస్తున్న క్రీడా వ్యాపార సంస్థలు, పెట్టుబడులు, నాయకత్వ బాధ్యతలు యథావిధిగా కొనసాగుతాయని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో వారి విడాకుల నిర్ణయం వ్యాపార రంగంపై ప్రభావం చూపే అవకాశం లేదని భావిస్తున్నారు.
దాదాపు మూడు దశాబ్దాల పాటు కలిసి జీవించిన ఈ జంట.. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా మారింది. అలీబాబా గ్రూప్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జో సాయ్ ప్రపంచ వ్యాపార రంగంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. మరోవైపు క్లారా వూ సాయ్ కూడా క్రీడా రంగంలో, పెట్టుబడుల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నప్పటికీ తమ వ్యాపార భాగస్వామ్యాలు, బాధ్యతలు కొనసాగుతాయని వారు స్పష్టం చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.








