చింతూరు, ఆగస్టు 1 (వై7 న్యూస్ తెలుగు)
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్న వారోత్సవాలను శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలవరం జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డా. వి. దివ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తల్లులు, గర్భిణులు, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు, వైద్య సిబ్బందికి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పిల్లల వైద్య నిపుణులు, ఎస్‌ఎన్‌సీయూ మెడికల్ ఆఫీసర్ డా. బి. మహేష్ మాట్లాడుతూ పుట్టిన గంటలోనే శిశువుకు తల్లిపాలను ప్రారంభించాలని, మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. అనంతరం పరిపూరక ఆహారంతో పాటు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.
తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడమే కాకుండా, ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, న్యూమోనియా, ఆకస్మిక శిశు మరణం (ఎస్‌ఐడీఎస్) వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయని వివరించారు. అలాగే తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలు కలుగుతాయని, ప్రసవానంతర రక్తస్రావం తగ్గడం, గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి చేరడం, రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్ల ప్రమాదం తగ్గడం వంటి లాభాలు ఉంటాయని చెప్పారు.
కార్యక్రమంలో తల్లులకు సరైన పద్ధతిలో పాలివ్వడం, శిశువును సక్రమంగా పట్టుకోవడం, తల్లిపాలపై ఉన్న అపోహలను నివృత్తి చేయడం వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. తల్లుల సందేహాలకు వైద్య నిపుణులు సమాధానాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డా. శివకుమార్, డా. రమణరావు, డా. భరద్వాజ్, డా. శశికళ, డా. స్పందన, డా. నిఖిల, డా. మాధవీలత, ప్రసూతి అనంతర తల్లులు, గర్భిణులు, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.









