దుమ్ముగూడెం , జూలై 30 (వై 7 న్యూస్):
దుమ్ముగూడెం మండలంలోని వర్క్ షాప్ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని బురదమయంగా మారడంతో ప్రజలు రాకపోకలు సాగించడానికి నానా అవస్థలు పడుతున్నారు.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్డు అంతా మురికి నీటితో నిండిపోయి పెద్ద పెద్ద గుంటలు ఏర్పడ్డాయని గ్రామస్తులు తెలిపారు. రోడ్డు సరిగా లేకపోవడంతో పాదచారులు, విద్యార్థులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా నిల్వ నీరు, మురికి కారణంగా దోమలు, విషపూరిత కీటకాలు అధికంగా పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారాయని గ్రామస్తులు పేర్కొన్నారు. పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
తక్షణమే గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి, మురుగు నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. సమస్యను అధికారులు పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.









