భద్రాచలం, జూలై 25: భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఉన్న ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాల్వంచ మండలం దంతులబోరు గ్రామానికి చెందిన గిరిజన సర్పంచ్ సిడెం వెంకటరమణ మృతి చెందిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘటన అత్యంత విషాదకరమని పేర్కొన్న ఆయన, వెంకటరమణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజలకు సేవలు అందించే ప్రజాప్రతినిధి ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వైద్యంలో నిర్లక్ష్యం, అలసత్వం లేదా సకాలంలో చికిత్స అందించడంలో లోపాలు జరిగినట్లు తేలితే సంబంధిత ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను కోరనున్నట్లు పొదెం వీరయ్య తెలిపారు.
గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే అమాయక ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులను ఆశ్రయించినప్పుడు వారికి మానవత్వంతో, బాధ్యతాయుతంగా, వెంటనే వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బంది, ఆసుపత్రి యాజమాన్యాలు వ్యవహరించాలని సూచించారు.
అనారోగ్యంతో ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగి ప్రాణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత వైద్య సంస్థలపై ఉందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గిరిజన ప్రజల ఆరోగ్య భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య స్పష్టం చేశారు.









