మెటా (Meta) సంస్థకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌స్టాగ్రామ్ టీనేజర్లను ఉద్దేశపూర్వకంగా ఎక్కువసేపు యాప్‌లో గడిపేలా రూపొందించిందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో మెటాతో పాటు సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌పై కూడా ఆరోపణలు నమోదయ్యాయి. యువతలో సోషల్ మీడియా వ్యసనం పెరగడంతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలు తీవ్రతరమవుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.
టెన్నెస్సీ ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యం ప్రకారం, టీనేజర్లపై ఇన్‌స్టాగ్రామ్ ప్రభావంపై మెటా సంస్థ అంతర్గతంగా పరిశోధనలు నిర్వహించిందని, వాటిలో యాప్ వల్ల కలిగే ప్రమాదాలు గుర్తించినప్పటికీ ఆ వివరాలను ప్రజలకు వెల్లడించలేదని ఆరోపించింది. ఈ నివేదికలను పలువురు ఉద్యోగులు మార్క్ జుకర్‌బర్గ్ దృష్టికి తీసుకెళ్లినా, హానిని తగ్గించే చర్యలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని కూడా పేర్కొంది.
అంతేకాకుండా, ప్లాట్‌ఫారమ్‌లో హానికరమైన కంటెంట్ పరిమాణంపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని కూడా పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి వచ్చే వారంలో కోర్టులో కీలక విచారణ జరగనుండగా, సోషల్ మీడియా సంస్థల బాధ్యతలపై మరోసారి చర్చ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.








