నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 152 ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, అయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరికీ శిక్ష పడలేదని ఆరోపించారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమంగా గుర్తింపు పొందిన భారత విద్యా వ్యవస్థ ప్రస్తుతం మోసపూరిత వ్యవస్థగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
గత పదేళ్లలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని రాహుల్ గాంధీ అన్నారు. వీరిలో ఎక్కువ మంది మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన వారేనని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం నీట్ పరీక్ష కోసం కుటుంబాలు సుమారు రూ.1.32 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయని, ఇది కేంద్ర ప్రభుత్వ మొత్తం విద్యా బడ్జెట్ రూ.1.4 లక్షల కోట్లకు దాదాపు సమానమని ఆయన వివరించారు.
విద్యార్థులు ప్రభుత్వం ముందు కేవలం మూడు చట్టబద్ధమైన డిమాండ్లు మాత్రమే ఉంచారని, వాటిని వెంటనే అమలు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్లకు పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.








