E-PAPER

ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం: కాంగ్రెస్ నిరసన

కరకగూడెం, జూలై 22 (వై7 తెలుగు న్యూస్): ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు జాతీయ నాయకుల అరెస్టులను నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని అంబేద్కర్–రాజీవ్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

AICC, TPCC, DCC పిలుపు మేరకు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం చేపట్టినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలు, నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, ఉపాధి అవకాశాల కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులను బలవంతంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని విమర్శించారు. భారత రాజ్యాంగం కల్పించిన శాంతియుత నిరసన హక్కును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు.

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, పేపర్ లీకేజీల వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉందని, ఆ హక్కును హరించే ఏ ప్రభుత్వాన్నైనా కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు.

భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని, ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు, మహిళలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రిపోర్టర్: దిలీప్, కరకగూడెం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!