జుట్టు ఎక్కువగా రాలడం ప్రారంభమైతే చాలా మంది ముందుగా తమ షాంపూనే కారణమని భావిస్తారు. వెంటనే కొత్త బ్రాండ్‌కు మారడం లేదా తరచూ షాంపూ మార్చడం చేస్తుంటారు. అయితే చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం, చాలా సందర్భాల్లో జుట్టు రాలడానికి షాంపూ ప్రత్యక్ష కారణం కాదు.
షాంపూ ప్రధానంగా తల చర్మం, జుట్టుపై పేరుకుపోయిన మురికి, చెమట, నూనె, దుమ్మును శుభ్రం చేసే క్లెన్సర్ మాత్రమే. ఇది జుట్టు కుదుళ్లలోకి వెళ్లి వాటిని దెబ్బతీసేలా పనిచేయదని నిపుణులు వివరిస్తున్నారు. కాబట్టి జుట్టు రాలడం ప్రారంభమైన వెంటనే షాంపూను తప్పుబట్టడం సరైన నిర్ణయం కాదని చెబుతున్నారు.
అలాగే జుట్టు రాలడం మరియు జుట్టు విరగడం రెండూ ఒకే విషయం కావు. కొన్నిసార్లు షాంపూలోని కొన్ని పదార్థాలు లేదా జుట్టు ఎక్కువగా పొడిబారడం వల్ల వెంట్రుకలు మధ్యలోనే విరిగిపోతాయి. దీనినే హెయిర్ బ్రేకేజ్ అంటారు. ఇది జుట్టు కుదుళ్ల నుంచి రాలిపోవడం కాదు. అందువల్ల షాంపూ మార్చినంత మాత్రాన అసలు సమస్య పరిష్కారమవుతుందని అనుకోవడం సరైంది కాదు. జుట్టు రాలడం ఎక్కువగా ఉంటే పోషకాహార లోపం, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కారణమా అనే విషయాన్ని వైద్య నిపుణులతో పరీక్షించుకోవడం మంచిది.








