విశాఖపట్నంలోని రుషికొండ ఐటీ హిల్-2లో ఎన్‌టిటి డేటా బిజినెస్ సొల్యూషన్స్ కొత్త కార్యాలయం ప్రారంభమైంది. 300 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ కేంద్రాన్ని ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. ఇదే సందర్భంగా సంస్థ అనుబంధ కంపెనీ ‘ప్రూవెన్ టెక్’ను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం రెండు షిఫ్టుల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, త్వరలో ఉద్యోగుల సంఖ్యను 900కు పెంచేలా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం పనిచేస్తున్న 300 మంది ఉద్యోగుల్లో 80 మంది ఇతర ప్రాంతాల నుంచి బదిలీపై రాగా, 200 మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు వెల్లడించారు. దీంతో విశాఖ ఐటీ రంగంలో స్థానిక ఉపాధికి మరింత ఊతం లభించనుంది.
సంస్థ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కునాల్ మాట్లాడుతూ.. ఈ కార్యాలయం సాధారణ బ్యాక్ ఆఫీస్ లేదా అవుట్‌సోర్సింగ్ కేంద్రంగా కాకుండా అత్యాధునిక ఇన్నోవేషన్ సెంటర్‌గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రూవెన్ టెక్ ప్రతినిధి రాజు, సింబియోసిస్ టెక్నాలజీస్ సీఈవో నరేశ్ కుమార్‌తో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.









