E-PAPER

భారత్ తొలి హైడ్రోజన్ రైలు సిద్ధం.. జులై 17న మోదీ ప్రారంభం

 

భారతదేశపు తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును జులై 17న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. హర్యానాలోని జింద్‌లో జెండా ఊపి ఈ రైలు సేవలను ప్రారంభించనున్న ప్రధాని.. జింద్–సోనిపత్ మార్గంలో రోజుకు రెండు సార్లు ఈ రైలును నడపనున్నారు. డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ రైలు ప్రారంభంతో జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ కూడా చేరనుంది.

రెండు డ్రైవింగ్ పవర్ కార్లు, ఎనిమిది ప్రయాణికుల కోచ్‌లతో రూపొందించిన ఈ రైలు ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రపంచంలోనే బ్రాడ్‌గేజ్‌పై నడిచే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైలుగా దీనిని రైల్వే శాఖ పేర్కొంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో విద్యుత్ ఉత్పత్తి చేసుకునే ఈ రైలు గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ప్రారంభ దశలో మాత్రం గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు.

ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మించగా, హైదరాబాద్‌కు చెందిన మేధా సెర్వో డ్రైవ్స్ సిస్టమ్ ఇంటిగ్రేషన్‌ను చేపట్టింది. కెనడాకు చెందిన బల్లార్డ్ పవర్ సిస్టమ్స్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ స్టాక్‌ను అందించింది. జింద్‌లో రోజుకు 420–430 కిలోల హైడ్రోజన్ ఉత్పత్తి చేసి, 3,000 కిలోల వరకు నిల్వ చేసే ప్రత్యేక ఇంధన కేంద్రాన్ని కూడా రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే దేశంలోని మరిన్ని మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టే యోచనలో భారతీయ రైల్వే ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!