ఓటర్ల నమోదు వేగవంతం చేయాలి.. అధికారుల ఆదేశాలు
బొబ్బిలి మున్సిపాలిటీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కింద ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో జేవీఎస్‌ఎస్ రామ్మోహనరావు, మున్సిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి అధికారులను ఆదేశించారు. గురువారం పలు సచివాలయాల పరిధిలో జరుగుతున్న ఓటర్ల నమోదు ప్రక్రియను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి పురోగతిని సమీక్షించారు.
వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను పరిశీలించిన అధికారులు, పనులు మందకొడిగా సాగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. నమోదు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
మందకొడిగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో అదనపు ఉద్యోగులను ఏర్పాటు చేసి ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి లాలం రామలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ బలివాడ గౌరీశంకర్‌తో పాటు బీఎల్‌వోలు పాల్గొన్నారు.









