E-PAPER

సింగరేణి కార్మికులకు అండగా ఉంటాం.. 20 నుంచి నిరవధిక దీక్ష: కవిత

 

సింగరేణి బాయి బాట కార్యక్రమంలో భాగంగా కార్మికులతో మమేకమవుతున్నట్లు టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆమె.. సింగరేణిలో పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై యాజమాన్యం వెంటనే దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ విధానాలు, పెండింగ్ బకాయిల కారణంగా సంస్థపై తీవ్ర ఆర్థిక భారం పడిందని, పని ముట్లు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. అధికారులకు ఒక రూల్, కార్మికులకు మరో రూల్ అమలు చేస్తున్నారని యాజమాన్యంపై విమర్శలు గుప్పించారు.

తెలంగాణకు రావాల్సిన బొగ్గు బ్లాక్‌లు కేంద్రంలోని బీజేపీ విధానాల వల్ల ప్రైవేట్ సంస్థలకు వెళ్తున్నాయని కవిత ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు సింగరేణిలో 62 వేల మంది రెగ్యులర్ కార్మికులు ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 38 వేలకు పడిపోయిందన్నారు. డిపెండెంట్ ఉద్యోగాల కోసం నెలలో రెండుసార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని, వారసత్వ ఉద్యోగాల ప్రక్రియను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఈ అంశంపై స్పష్టత ఇవ్వకపోతే ఈ నెల 20 నుంచి రామగుండంలో నిరవధిక దీక్ష చేపడతామని హెచ్చరించారు.

రాజకీయ అంశాలపై స్పందించిన కవిత.. బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు వివరణల పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్లు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చాయని ఆరోపిస్తూ, ఆ నిధులపై విచారణ జరిపి ఉద్యమకారుల కుటుంబాలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, “కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్‌ఎస్‌లో చేరే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News